మహేశ్వరం ( రంగారెడ్డి) : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని , రాష్ట్రానికి ఆయనే శ్రీరామ రక్ష అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy) అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లిలో జరిగిన వివిధ అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. మన్సాన్పల్లి, గట్టుపల్లిలో పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ లో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కులాలను చైతన్య పరిచేందుకు కుల సంఘాల భవనాలను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశంతో మహేశ్వరంలోని విశ్వకర్మ, నాయిబ్రాహ్మణ, రజక, వడ్డెర, కుమ్మరి కుల సంఘాలకు నాలుగు వందల గజాల చొప్పున స్థలాలను కేటాయించి నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని వివరించారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు (Welfare Schemes)రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకు అందుతున్నాయని వెల్లడించారు. రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలోని రైతులకు రూ. 20 వేల కోట్లతో రుణమాఫి చేశారని గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగసాములు కావాలని పిలుపునిచ్చారు.
రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ప్రజలు మద్దతు తెలిపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఆనందం పాల్గొన్నారు.