
తుక్కుగూడ, ఏప్రిల్ 26 : ప్రభుత్వ స్థలాల్లో వైకుంఠధామాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో సరైన వైకుంఠధామాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ స్థలాలను కేటాయించి వైకుంఠధామాలను నిర్మించాలని కోరుతూ సోమవారం మున్సిపల్ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకట్‌రెడ్డి మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. తుక్కుగూడ శ్రీనగర్‌లోని సర్వేనంబర్ 67లో ఐదు ఎకరాలు, రావిరాలలో సర్వేనంబర్ 243లో ఐదు ఎకరాలు, సర్ధార్‌నగర్‌లో సర్వేనంబర్ 131లో ఐదు ఎకరాలు, మామిడికుంట బాసగూడ తండాలో సర్వేనంబర్ 9లో ఒక ఎకరం, మంఖాల్ సర్వేనంబర్ 139,140లో ఐదు ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని, వాటిని ప్రజా అవసరాల కోసం వైకుంఠధామాలకు కేటాయించాలని చైర్మన్, వైస్ చైర్మన్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే సర్వే నిర్వహించి నివేదిక అందజేయాలని మండల తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో ప్రజల అవసరాల కోసం సకల సౌకర్యాలతో వైకుంఠధామాలను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రతి గ్రామంలో, పట్టణ ప్రాంతాల్లో పల్లె, పట్టణ ప్రగతి నిధులతో ప్రజల సౌకర్యార్థ్ధం వైకుంఠధామాలను నిర్మించడం జరిగిందని వివరించారు. నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా తుక్కుగూడ మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల నిధులతో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బూడిద తేజస్వినీ శ్రీకాంత్‌గౌడ్, సప్పిడి లావణ్య రాజుముదిరాజ్, రెడ్డిగళ్ల సుమన్, బాదావత్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.