Kamaal Rashid Khan | ప్రముఖ సినీ విమర్శకుడు, వివాదాస్పద నటుడు కమల్ రషీద్ ఖాన్ (KRK)ను ముంబై పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఉన్న ఒక నివాస భవనంపై కాల్పులు జరిపిన ఆరోపణలపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. జనవరి 18న జరిగిన ఈ కాల్పుల ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన అధికారులు, కేఆర్కేనే ఈ పని చేసినట్లు ప్రాథమికంగా గుర్తించి శుక్రవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సదరు భవనంలో రెండో అంతస్తులో రచయిత నీరజ్ కుమార్ మిశ్రా, నాలుగో అంతస్తులో మోడల్ ప్రతీక్ నివసిస్తుండటంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల విచారణలో కేఆర్కే స్పందిస్తూ.. తన లైసెన్స్డ్ తుపాకీని శుభ్రం చేసిన తర్వాత, అది సరిగ్గా పనిచేస్తుందో లేదో పరీక్షించేందుకే కాల్పులు జరిపినట్లు తెలిపినట్లు సమాచారం. తన నివాసం ముందున్న అడవి వైపు గురి చూసి కాల్చానని, అయితే అనుకోకుండా బుల్లెట్లు పక్కనే ఉన్న భవనం వైపు వెళ్లాయని ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా లక్ష్యం చేసుకోలేదని ఆయన పేర్కొన్నప్పటికీ, పోలీసులు ఆయన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు స్పష్టం చేశారు.