MegaStar Movie | మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకరవరప్రసాద్‌గారు టికెట్ ధరల పెంపు వ్యవహారం ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రభుత్వం అనుమతించిన అదనపు టికెట్ ధరల ద్వారా వసూలైన సుమారు రూ. 42 కోట్లను వెంటనే రికవరీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది పాదూరి శ్రీనివాసరెడ్డి వేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం, ఆ రూ. 42 కోట్ల వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు జీఎస్టీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
గతంలో కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఈ నెల 8న జారీ చేసిన మెమో ద్వారా అక్రమంగా ఈ భారీ మొత్తాన్ని ఆర్జించారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం జారీ చేసిన సదరు మెమోలో ప్రత్యేక షోల టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించడమే కాకుండా, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ పెంపు నిబంధనలకు విరుద్ధమని, అందుకే ఆ అదనపు వసూళ్లను రికవరీ చేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు, సంబంధిత ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.