అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఒకటిన్నర నిమిషం శ్రమదానం చూసి అంతా నవ్వుకుంటున్నారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రమదానం పేరుతో పవన్ కల్యాణ్ పబ్లిసిటీ స్టంట్ చేశారని, ఈ తరహా శ్రమదానం పవన్ ఒక్కరే చేయగలరేమో అన్నారు. వైఎస్సార్సీపీపై యుద్ధం ప్రకటించానని పవన్ చెబుతున్నారని, ఏ కారణంతో ప్రభుత్వంపై యుద్దం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో పేదలను ఆదుకున్నందుకు యుద్దం చేయాలా? అంటూ నిలదీశారు.
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టింనందుకు యుద్దం చేయాలా? అని మండిడ్డారు. పవన్ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వర్షాలు తగ్గాక రోడ్లు మరమ్మతులు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని, రోడ్ల మరమ్మతులకు రూ.2,200 కోట్లు కేటాయించారన్నారు. రోడ్లు పూడుస్తామని చెప్పి కుల రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. సమాజాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలుగానే పవన్ చూస్తున్నారా? అని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పవన్‌కు చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోంది.. రాజకీయాలంటే సినిమా యాక్షన్ కాదని పవన్ గుర్తించాలంటూ హితవు పలికారు.