హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏడేండ్లలో ఒక్కటంటే ఒక్క విద్యాలయాన్ని కూడా తెలంగాణకు ఇవ్వలేదని ప్రధాని మోదీని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు నిలదీశారు. తమిళనాడులో బుధవారం 11 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ‘గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోదీ గారు! జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ యువత, విద్యార్థుల తరఫున అడుగుతున్నా.. గత ఏడేండ్లలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒక్క విద్యాలయాన్ని కూడా తెలంగాణకు కేటాయించలేదు. అన్ని స్థాయిల్లో ఎన్నో అభ్యర్థలు చేశాం. అయినా ఫలితం లేదు. ఆ అభ్యర్థనలను వీలైనంత తర్వగా వీటిని తీర్చాలని కోరుతున్నా’ అని పేర్కొంటూ ఒక్క విద్యాలయాన్ని కూడా రాష్ర్టానికి ఇవ్వలేదని తెలిపేలా ఒక ఫొటోను జత చేశారు. దేశంలోని అనేక రాష్ర్టాలకు విద్యాలయాలు, వైద్యకళాశాలలను మంజూరు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణను విస్మరించిందని ఆక్షేపించారు. పునర్విభజన చట్టంలో గిరిజన విశ్వవిద్యాలయం మంజూరును పేర్కొన్నా అదీ చేయలేదని ప్రశ్నించారు. ఏడేండ్లలో కేంద్రం మంజూరు చేసిన విద్యాలయాల వివరాలను ట్వీట్లో పేర్కొన్నారు.
‘మరణం నా చివరి చరణం కాదు’ అని ప్రముఖ కవి, చిత్రకారుడు అలిశెట్టి ప్రభాకర్ చేసిన ధీరోదాత్త ప్రకటన ప్రతి లక్ష్యసాధకుడిలో స్ఫూర్తి నింపాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం అలిశెట్టి ప్రభాకర్‌కు మంత్రి ట్విట్టర్ ద్వారా నివాళి అర్పించారు. ‘కవి, చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్‌గా చివరకంటూ సమాజం కోసమే తండ్లాడిన ప్రజాకళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి, వర్ధంతి ఒకటే రోజు కావడం యాదృచ్ఛికమే అయినా.. మరణం నా చివరి చరణం కాదు అని ఆయన చేసిన ధీరోదాత్త ప్రకటన ప్రతీ లక్ష్యసాధకుడికి స్ఫూర్తి నింపాలి’ అని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా నర్కొడా గ్రామ సమీపంలోని వెయ్యేండ్ల నాటి సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి కే తారకరామారావు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వీ శ్రీనివాస్ గౌడ్‌కు సూచించారు. ట్విట్టర్లో ఒక వ్యక్తి నర్కొడా సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాలని, పునరుద్ధరిస్తే మంచి పర్యాటక ప్రాంతంగా మారుతుందని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి.. ఆ దేవాలయ పునరుద్ధరణ వినతిని పరిశీలించాలని సూచించారు.