
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): చెత్త నుంచి విద్యుత్తు (వేస్ట్ టు ఎనర్జీ) ను ఉత్పత్తి చేయడంలో హైదరాబాద్ దేశంలోనే ముందంజలో ఉన్నదని పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. జవహర్‌నగర్‌లోని ప్లాంటు ద్వారా మరో 28 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతి లభించిందని చెప్పారు. దీంతో చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ ప్లాంటు సామర్థ్యం 48 మెగావాట్లకు పెరుగుతుందని, దేశంలోనే ఇది అతి పెద్దదని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ప్లే గ్రౌండ్లో 1,350 స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.
ఆనంతరం మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ 250 మంది లబ్ధిదారులకు స్వచ్ఛ ఆటోలను పంపిణీచేశారు. హైదరాబాద్‌లో గతంలో రోజుకు 3,500 మెట్రిక్ టన్నుల చెత్తను మాత్రమే సేకరించగా, ప్రస్తుత సామర్థ్యం 6,500 మెట్రిక్ టన్నులకు పెరిగిందని వివరించారు. ప్రస్తుతం 5,250 ఆటోల ద్వారా ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సఫాయి కార్మికుల గౌరవ వేతనాలు మూడుసార్లు పెంచారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో 40 లక్షల పైబడిన జనాభా విభాగంలో హైదరాబాద్ నగరానికి అవార్డు వస్తున్నదని చెప్పారు. ఇదే స్ఫూర్తితో చెత్త సేకరణపై ఉన్నతాధికారులు మరింతగా దృష్టి సారించి, మెరుగైన ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. 1,350 స్వచ్ఛ ఆటోల పంపిణీతో హైదరాబాద్‌లో పారిశుద్ధ్యం మరింత మెరుగుపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేతకాని, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, అదనపు కమిషనర్ సంతోష్, కార్పొరేటర్లు లక్ష్మీబాల్‌రెడ్డి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.