లక్నో: ఒక యువకుడు తన ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెను కలిశాడు. గమనించిన యువతి కుటుంబ సభ్యులు అతడ్ని పట్టుకుని కొట్టి చంపారు. యువకుడి కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (teen beaten to death) ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 19 ఏళ్ల శివ ప్రసాద్ గురువారం రాత్రి మహువా ఖడా గ్రామంలోని ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెను కలిశాడు. ఆ యువతి కుటుంబ సభ్యులు అతడ్ని పట్టుకున్నారు. కర్రలు, పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న శివప్రసాద్ కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి అతడ్ని ఆసుపత్రికి తరలించగా మరణించాడు. ఈ నేపథ్యంలో యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రియురాలి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ దాడిలో ప్రియురాలైన యువతి కూడా గాయపడిందని, ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.