హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ర్టానికి చెందిన ప్లేయర్లు షేక్ తహసీన్, తేజావత్ సుకన్యా భాయ్‌కి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మద్దతుగా నిలిచారు. జాతీయ, అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నీల్లో పతకాలు సాధించిన తనకు మీ సాయం కావాలంటూ సుకన్య ట్విట్టర్లో కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, మీ మద్దతుతో భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్నట్లు సుకన్య ట్వీట్‌కు మంత్రి వెంటనే స్పందించారు. సుకన్యకు చేయూత అందించాలంటూ క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ టోర్నీలో తెలంగాణ తరఫున ఎన్సీసీ క్యాడెట్ హోదాలో బరిలోకి దిగిన షేక్ తహసీన్ తనకు మద్దతు నిలువాలంటూ కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. ఖరీదైన క్రీడ షూటింగ్లో మరిన్ని విజయాలు సాధిస్తానని, ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలన్న కల నెరవేర్చుకునేందుకు సాయం కావాలంటూ కోరాడు. దీనికి స్పందించిన కేటీఆర్ ఈ విషయంలో స్టార్ షూటర్ గగన్ నారంగ్ సరైన వ్యక్తి అంటూ సమాధానమిచ్చారు. క్యాడెట్ షూటర్‌తో ‘గన్ ఫ్లర్ గ్లోరీ’అకాడమీ టచ్‌లో ఉంటుందంటూ కేటీఆర్‌కు నారంగ్ రిప్లే ఇచ్చాడు.