రాష్ట్ర ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. విభజన హామీలను మోదీ నెరవేర్చకపోవడం తీవ్ర విచారకరమని అన్నారు. తెలంగాణ అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందుతుంటే, దాన్ని చూసి మోదీ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రాజ్యసభలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన తీరు పట్ల మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు వీరోచిత పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. విద్యార్థి అమరవీరుల త్యాగం, సబ్బండ వర్గాల రాజీలేని పోరాటంతో సాధించుకున్న తెలంగాణ ప్రజలను మోదీ ఘోరంగా అవమానించారు. తెలంగాణలోని ఏడు మండలాలు, సీలేరు పవర్ ప్లాంటును ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా మోదీ ఆంధ్రలో కలిపారు. నిన్న కాక మొన్న భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని ఆందోళనకు దిగడాన్ని మోదీకి గుర్తు చేస్తున్నానన్నారు.
‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ను మించి అన్ని రంగాలలో ప్రగతిపథాన దూసుకుపోతోంది. అది చూసి ఓర్వలేకపోతుండు. విభజన హామీలను ప్రధాని నెరవేర్చకపోగా, తెలంగాణపై ఈవిధంగా విషం చిమ్మడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నరు. బీజేపీ తెలంగాణ నాయకులు ప్రజల ముందుకు ఏ మొఖం పెట్టుకుని పోతరు? వారడిగే ప్రశ్నలకు ఏం బదులిస్తరు?’ అంటూ మంత్రి మండిపడ్డారు.