-విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నల్లగొండ, మార్చి 27 : యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి, కేంద్రమే కొనుగోలు చేయాలని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆహార ఉత్పత్తుల నిల్వలు, ఎగుమతులు, దిగుమతులతో పాటు ధరల పెరుగుదల, నియంత్రణ కేంద్రం ఆధీనంలోనే ఉంటాయని వివరించారు. కేంద్రం ఈ ప్రక్రియను నిలిపివేస్తూ, రైతుల వ్యతిరేక పద్ధతులు అవలంబిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని మూడేండ్లకు సరిపడ ఆహార నిల్వలు ఉంచుకోవాలని ఆహార భద్రత చట్టం నిర్దేశించిదని పేర్కొన్నారు. గోధుమలు, వడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని, అవి ఎక్కడ పండినా, తప్పనిసరిగా సేకరించి మిగిలిన ప్రాంతాలకు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని చెప్పారు. టీఆర్ఎస్ను అస్థిర పరుచాలనే కుట్రతో కేంద్రం ఒకరకంగా, రాష్ట్ర బీజేపీ నేతలు మరో రకంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో దేశీయ అవసరాలు తీర్చడానికి పార్బాయిల్డ్ రైస్ మిల్లులను ఏర్పాటు చేయించింది, ఎక్కువ దిగుబడి కోసం దొడ్డు రకం వడ్లను ప్రోత్సహించింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.