హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): సాగు చట్టాలపై పోరాటంలో అసువులుబాసిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3లక్షల ఆర్థికసాయం ప్రకటించడాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇరకాటంలో పడ్డారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రికి వస్తున్న ఆదరణను చూసి బీజేపీ నాయకులు ఓర్వలేక కుత్సిత బుద్ధితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి చేతులు దులుపుకొంటే సరిపోదని స్పష్టంచేశారు. రైతుల పట్ల కేంద్రప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తున్నదని వ్యాఖ్యానించారు.
ఆదివారం తెలంగాణ భవన్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, మెతుకు ఆనంద్, కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి రాష్ట్ర రైతులను మోసంచేసే కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. రైతుల పట్ల బాధ్యాతారాహిత్యంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.
రాష్ట్రంలో సంజయ్, బీజేపీ ఆటలు సాగనివ్వబోమని స్పష్టంచేశారు. రెండు నెలలుగా రైతులను అయోమయానికి గురిచేస్తున్న బండికి గుణపాఠం తప్పదన్నారు. యాసంగి పంట కొనుగోలు విషయం ఫిబ్రవరిలో తేలుస్తామని చెప్పటం సంజయ్ అవగాహనా రాహిత్యానికి, అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. తిక్కమాటలు మానుకోవాలని హితవుచెప్పారు.
బియ్యం సేకరణ విషయంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులు తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. యాసంగిలో రైతులు ఏ పంట పండించాలో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ విధానాలు మార్చుకోకపోతే నల్లగొండ రైతుల తిరుగుబాటే రాష్ట్రవ్యాప్తంగా వస్తుందని హెచ్చరించారు. వడ్లు భూమి లోపల పండుతాయో, పైన పండుతాయో కూడా తెలియని అజ్ఞాని బండి మాటలు నమ్మొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
రైతులకు కేంద్రం, బీజేపీ చేసిన మేలు ఏమిటో చెప్పాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని దేశంలో ఎక్కడైనా అమలు చేస్తున్నారా? అని నిలదీశారు. కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తెచ్చేదాకా రైతులను ఆదుకోవాలన్న సోయి దేశంలో ఎవరికీ లేకపోయిందన్నారు.