రవీంద్రభారతి, డిసెంబర్ 6 : లోకకల్యాణం కోసం ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జె.సంతోశ్‌కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా నిర్మాతగా, పూర్ణచందర్ దర్శకత్వంలో ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని సోమవారం రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, చెట్లు అంతరించిపోవడం వల్ల మొత్తం మానవజాతికే ప్రమాదం వస్తుందని గ్రహించిన సీఎం కేసీఆర్.. హరిత తెలంగాణే లక్ష్యంగా 2 కోట్ల మొక్కలు నాటారన్నారు.
ఎంపీ సంతోష్‌కుమార్ ప్రకృతి ప్రేమికుడు కావడంతో కేసీఆర్ తలపెట్టిన హరిత చాలెంజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా పాటల సీడీని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్, ఉపేందర్, శుభప్రద్‌పటేల్, గ్రీన్ చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ, పాటల రచయిత తిరుపతి తదితరులు పాల్గొన్నారు.