హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో ఓట్ల కోసం బీజేపీ దొంగ వినయం నటిస్తుందని మరోసారి రుజువైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంధన ధరల పెంపుపై కేంద్రం వైఖరిని ఎండగడుతూ శనివారం ట్వీట్ చేశారు. 5 రాష్ర్టాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయని తాము ప్రజలను ముందే అప్రమత్తం చేశామని గుర్తుచేశారు. అనుకున్నట్టుగానే ధరలు భారీగా పెంచడం ద్వారా బీజేపీ ప్రభుత్వం తన మోసపూరిత వైఖరిని మరోసారి చాటుకొన్నదని మండిపడ్డారు.
‘ఒడ్డు చేరేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న.. అన్న సామెత బీజేపీని చూసి వచ్చిందేమో. ఎక్కడ ఎన్నికలు జరిగినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్టు చెప్తుంది. ఎన్నికలు ముగియగానే తన ప్రజావ్యతిరేక నైజాన్ని బయటపెడుతున్నది’ అని ధ్వజమెత్తారు. తాజాగా 5 రాష్ర్టాల ఎన్నికలు పూర్తి కాగానే ఇంధన ధరలను అమాంతం పెంచి, ప్రజల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. కరోనాతో ఆదాయం కోల్పోయిన ప్రజలకు ధరల పెంపుతో కష్టాలు రెట్టింపు కానున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.