హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ)/కవాడిగూడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని అన్నదాతల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచి ప్రధాని మోదీ కండ్లు తెరిపించడానికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకొని శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు.
హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో గురువారం చేపట్టబోయే నిరసన కార్యక్రమ ఏర్పాట్లను బుధవారం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి హరీశ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ.. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల, రైతుల పక్షాన ఉంటుందని స్పష్టంచేశారు. గతంలో కేంద్రం అన్యాయంగా తెలంగాణలోని 7 మండలాలతోపాటు లోయర్ సీలేరు విద్యుత్తు ప్లాంట్‌ను ఏపీలో కలిపిందని, దీనివల్ల రాష్ర్టానికి ఏటా వెయ్యి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నదని పేర్కొన్నారు.
ఆ రోజుల్లోనే దానిపై కూడా నిరసన తెలిపామని గుర్తుచేశారు. పంజాబ్‌లో ప్రతి గింజ కొంటున్నారని, తెలంగాణకు వచ్చేసరికి ధాన్యాన్ని ఎందుకు కొనరని ప్రశ్నించారు. రాష్ర్టానికో విధానం ఉండొద్దని హితవుపలికారు. కేంద్రం బాధ్యలనుంచి తప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు. 5 లక్షల టన్నుల ధాన్యం ఇంకా గోడౌన్లలోనే ఉన్నదని చెప్పారు.
పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతన్నలకు అండగా నిలిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావంగా నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. ధర్నా చౌక్‌లో ఏర్పాట్లను బుధవారం రాత్రి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలిం చారు. ధర్నా చౌక్ ఏర్పాట్లను పరిశీలించినవారిలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, జోగు రామన్న, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, డీసీపీ విశ్వప్రసాద్, టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్, టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.