జమ్మికుంట: “మీ సభలకు మేం కరెంట్ కట్‌చేయడం లేదు.. మీ జనరేటర్లో డీజిల్ అయిపోంది” అంటూ ఈటల రాజేందర్‌కు మంత్రి హరీశ్‌రావు చురకలంటించారు. బీజేపీ ప్రచార సభలు, సమావేశాలకు కరెంట్ కట్ చేస్తున్నారని ఇటీవల ఈటల రాజేందర్ అసత్య ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జమ్మికుంట పట్టణంలోని ఫంక్షన్హాల్లో జరిగిన సమావేశంలోనూ కరెంట్ పోవడంతో టీఆర్ఎస్ నాయకులు కావాలనే కరెంట్ కట్చేశారంటూ ఈటల మళ్లీ ఆరోపించారు. దీనిపై జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో జరిగిన సభలో మంత్రి హరీశ్‌రావు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఈటల రాజేంద్ర కేంద్రం పెంచిన డీజిల్ ధరల వల్లే నీ సభలకు అంతరాయం కలుగుతోందంటూ చురకలంటించారు. ఈటల రాజేందర్ సభలు నిర్వహిస్తున్న ఫంక్షన్‌హాల్‌కు కరెంట్ కనెక్షన్ లేదని, బిల్లులు చెల్లించకుంటే కట్‌చేశారని హరీశ్‌రావు చెప్పారు. ప్రస్తుతం ఆ ఫంక్షన్‌హాల్ జనరేటర్‌తో నడుస్తున్నదని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచడంతో ఫంక్షన్‌హాల్ నిర్వాహకులు తక్కువ డీజిల్ వాడుతున్నట్టున్నారని, అందుకే డీజిల్ అయిపోయి కరెంట్ సరఫరా నిలిచిపోతున్నదన్నారు. ఈ విషయం తెలియకుండా టీఆర్ఎస్ పార్టీపై ఈటల రాజేందర్ అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇకనైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని హితవుపలికారు.