హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ ఢిల్లీలో ఒకమాట.. రాష్ట్రంలో మరోమాట మాట్లాడుతున్నదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వడ్ల కొనుగోలుపై బీజేపీ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా మాట్లాడి బట్టబయలుచేశాక బీజేపీ నేతలు వేరే మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో యూటర్న్ తీసుకొన్నదెవరో రైతులకు అర్థమైందని తెలిపారు. వడ్లు పండించొద్దు.. పండిస్తే తాము తీసుకోబోమని కరాఖండిగా చెప్పింది కేంద్రంలోని బీజేపీ సర్కారేనని.. రాష్ట్రంలో బీజేపీ నేతలు మాత్రం వడ్లు కొనాలని ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు.
రైతులను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలని మంత్రి హరీశ్ అన్నారు. రాష్ట్ర రైతులకు న్యాయం జరిగేదాకా ఈ అంశంపై ఆందోళనను తాము ఇడిసిపెట్టేదే లేదని తేల్చిచెప్పారు. తెలంగాణభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ రైతుల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ధర్నాలు చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ ధర్నా ఎందుకోసం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వానకాలం వడ్ల కొనుగోళ్లు ప్రారంభించిందని గుర్తుచేశారు. బీజేపీ నేతలు ఏ జిల్లాకు.. ఏ మండలానికి వస్తారో చెప్పాలని.. తాను తీసుకెళ్లి చూపిస్తానని సవాల్ విసిరారు.
యాసంగిలో వడ్లు కొనాలని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్ఎస్ ధర్నాకు పిలుపు ఇస్తే.. తామెక్కడ వెనకబడి పోతామో అన్న ఆందోళనతో పచ్చి అబద్ధాలను ప్రచారం చేయటానికి బీజేపీ ఇలాంటి ఎత్తులకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం చేతులెత్తేసిందని రైతులకు అర్థమైపోయిందని, అందుకే ఆ పార్టీ చేసిన ధర్నాలో రైతులు కాకుండా పార్టీ కార్యకర్తలే ఉన్నారని చెప్పారు. రా రైస్ కొంటామంటూ కిషన్‌రెడ్డి అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారన్న హరీశ్‌రావు.. తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైసే వస్తాయనే సంగతి తెల్వదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. పంజాబ్‌లో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు తెలంగాణ వడ్లను ఎందుకు కొనరని ప్రశ్నించారు. పంజాబ్‌కో నీతి.. తెలంగాణకో నీతా? అని బీజేపీ నేతలను నిలదీశారు. గత ఏడేండ్లుగా ధాన్యాన్ని తామే కొంటున్నామని బీజేపీ నేతలు పేర్కొనటాన్ని మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా పరిగణించారు. రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు.
దేశవ్యాప్తంగా బడా పారిశ్రామికవేత్తలపై ఉన్న ప్రేమ రైతులపై ఎందుకులేదని ఆయన ప్రశ్నించారు. బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలపై ఉన్న రూ.10 లక్షల కోట్ల బకాయిలను మాఫీ చేసినట్టే, రైతు ప్రయోజనాల కోసం కేంద్రం ఎందుకు ఆలోచించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే విదేశాంగ విధానాన్ని, దేశ ఎగుమతి విధానాన్ని మార్చుకొని రైతులకు మేలుచేయాలని డిమాండ్‌చేశారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేందుకు తాము ఎక్కడిదాకైనా వెళ్తామన్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా లక్షల మందితో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్లో తమ పార్టీ ఎంపీలు ఆందోళన కార్యక్రమాలను చేపడతారని మంత్రి హరీశ్ వెల్లడించారు.