గజ్వేల్, మార్చి 27: తెలంగాణ ప్రజలను అవమానించేలా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌కు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఉగాది తర్వాత ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ధాన్యం సేకరణలో కేంద్రం పంజాబ్‌కు ఒక నీతి, తెలంగాణకు మరొక నీతి అమలు చేస్తున్నదని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. రైతులసంక్షేమానికి కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలని కోరారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే కేంద్రంతో కొట్లాడి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సవాల్ చేశారు. గ్యాస్ ధరలు పెంచి కట్టెల పొయ్యిపై వంట చేసుకునే రోజులను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు.