సిటీబ్యూరో, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలో 2021-22వ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రవేశ పెట్టిన మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. ఇంజినీరింగ్‌లో మైనింగ్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్సీ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) వంటి సరికొత్త అంశాలతో పాటు కలిసి మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సును రూపొందించారు. వీటిలో ఎంసెట్-21 కౌన్సెలింగ్ ద్వారా సీట్లు నండాయి.
ఈ ఏడాది నుంచి తొలి సారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ కోర్సులో మొత్తం 60 సీట్లకు గాను 47 సీట్లు నిండాయని, మిగిలిన 13 సీట్లు కూడా ఈసెట్ ద్వారా (లాటరల్ ఎంట్రీ) ద్వారా సెకండియర్‌లో నిండుతాయని ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సును కొత్తగా అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఎన్టీపీసీ, సింగరేణి సంస్థల భాగస్వామ్యంతో ఓయూలో మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సును ఈ ఏడాది నుంచి తిరిగి పునరుద్ధరించారు. ప్రస్తుతం ఎన్టీపీసీ, సింగరేణి, ఓఎన్జీసీ వంటి మైనింగ్ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఓయూలో మైనింగ్ ఇంజినీరింగ్ సిలబస్ అందించడానికి ముందుకు వచ్చారు. అందుకోసం గతంలో ఓయూలో చదివిన పూర్వ విద్యార్థుల సంఘం నుంచి మంచి ప్రోత్సాహం కూడా లభించింది.
ఓయూలో మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం కోసం సిలబస్, భవనాల కల్పన, అవసరమైన ల్యాబులు సిద్ధం చేశారు. భవనాలు, ల్యాబులు, ఫ్యాకల్టీ వంటి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లయితే అఫిలియేషన్ కాలేజీలలో కూడా మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులోకి తీసుకురావడానికి అనుమతులు మంజూరు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఓయూ అధికారులు స్పష్టం చేశారు.
ఓయూలో ఆధ్వర్యంలో ఏఐ, ఐవోటీతో పాటు మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన యువతకు ఎన్టీపీసీ, సింగరేణి వంటి పెద్ద సంస్థలలో తప్పకుండా ఉద్యోగాలు లభించనున్నాయి. మైనింగ్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇప్పటికే ఆ సంస్థలు ఇచ్చిన హామీతోనే ఈ మేరకు మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సును తిరిగి పునరుద్ధరించామని ఓయూ ప్రొఫెసర్లు తెలిపారు.
మైనింగ్ విద్యార్థులకు భవిష్యత్తులో మైనింగ్ సంస్థల్లోనే కాకుండా సాఫ్ట్వేర్ సంస్థలలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదనంగా మైనింగ్ సంస్థలు ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియా, నెదర్లాండ్, జపాన్, కెనడా వంటి దేశాలలో కూడా మైనింగ్ ఇంజినీరింగ్ యువతకు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, అందుకు సంబంధించిన అవగాహన కూడా ఓయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు.
ఇప్పటికే కేయూ పరిధిలో కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్, జేఎన్టీయూ పరిధిలోని మంథని ఇంజినీరింగ్ కాలేజీలలో మైనింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, డిమాండ్‌కు అనుగుణంగా ఈ కోర్సులు అందుబాటులో లేవన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాని, ప్రస్తుతం మార్కెట్, పారిశ్రామిక, ప్రభుత్వ రంగం, మల్టీ నేషనల్ సంస్థలలో కూడా మైనింగ్ ఇంజినీర్ల కొరత తీవ్రంగా ఉండటంతో ఓయూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ అభిప్రాయపడ్డారు.