వాషింగ్టన్, ఫిబ్రవరి 19: దేశంలో తుపాకీ సంస్కృతి అంతకంతకూ పెరిగిపోతున్నదని అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో చిన్నారుల కోసం మినీ తుపాకీని (కిడ్స్ రైఫిల్) తయారు చేసినట్టు అక్కడి ఆయుధ తయారీ సంస్థ ఒకటి ప్రకటించింది. జేఆర్-15 (జూనియర్ రైఫిల్-15)గా పిలిచే ఈ తుపాకీ నిజమైన ఏఆర్-15 తుపాకీకి ఏ మాత్రం తీసిపోదని వెల్లడించింది. ఏఆర్-15 రైఫిల్‌తో పోలిస్తే 20 శాతం చిన్నగా ఉండే ఈ తుపాకీ కేవలం ఒక కిలో బరువు మాత్రమే ఉంటుందని తయారీ సంస్థ వీ1 టాక్టికల్ వివరించింది. 0.22 క్యాలిబర్ బుల్లెట్లను పూర్తిగా లోడ్ చేస్తే పది రౌండ్ల వరకు కాల్పులు జరుపొచ్చని తెలిపింది. రైఫిల్ ధరను 389 డాలర్లు (రూ. 29 వేలు)గా నిర్ణయించింది. షూటింగ్ నేర్చుకొనే పిల్లలకు నిజమైన తుపాకీ అనుభవాన్ని కలిగించేందుకే దీన్ని తయారుచేసినట్టు సదరు సంస్థ వెల్లడించింది. దీన్ని సామాజిక కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు.