e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 1, 2021
Home News కశ్మీర్‌ను వీడుతున్న వలస కూలీలు

కశ్మీర్‌ను వీడుతున్న వలస కూలీలు

  • ఉగ్రదాడుల భయంతో సొంత రాష్ర్టాలకు పయనం
  • రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద చలికి వణుకుతూ పడిగాపులు

జమ్ము/శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌ నుంచి వేలాది మంది వలస కూలీలు భార్యాపిల్లలతో కలిసి మూటాముల్లె సర్దుకొని సొంత రాష్ర్టాలకు వెళ్లిపోతున్నారు. కశ్మీర్‌ పౌరులతో పాటు స్థానికేతరులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతుండటంతో వలస కూలీల కుటుంబాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని తిరుగుముఖం పట్టాయి. వీరంతా రాత్రివేళ చలిగాలులకు వణుకుతూ జమ్ముకశ్మీర్‌లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద రోడ్డుపక్కన గూడు, గుక్కెడు నీరు సైతం లేక పడిగాపులు కాస్తున్నారు. జమ్ము, ఉధంపూర్‌ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు వలస కూలీలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతి ఏటా మార్చి మొదట్లో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ర్టాల నుంచి 3 నుంచి 4 లక్షల మంది వలస కూలీలు జమ్ము కశ్మీర్‌లో వండ్రంగం, వెల్డింగ్‌, వ్యవసాయం, తాపీపనులు చేసేందుకు వస్తుంటారు. వీరిలో అత్యధికులు హిందువులే. అయితే ఇటీవల స్థానికేతరులపై ఉగ్రదాడులతో వలస కూలీలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఆదివారం కుల్గాంలో బీహార్‌కు చెందిన ఇద్దరు కూలీలను వారి ఇంట్లోకి చొరబడి ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ నెలలోనే ఉగ్రదాడుల్లో 11 మంది వలస కూలీలు మృత్యువాతపడ్డారు. ఇలాంటి భయానక పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని, మా ప్రాణాలను కాపాడుకునేందుకు సొంత ప్రదేశాలకు వెళ్లిపోతున్నామని పలువురు వలస కూలీలు గోడు వెళ్లబోసుకున్నారు.

కశ్మీర్‌లో పౌరుల హత్యలపై ఎన్‌ఐఏ దర్యాప్తు!
కశ్మీర్‌లో ఇటీవల జరిగిన పౌరుల హత్యలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేపట్టనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఈ హత్యల తీరును చూస్తుంటే ఉగ్రవాద కోణం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తున్నదని, కాబట్టి దర్యాప్తు బాధ్యతను ఎన్‌ఐఏకు బదలాయించనున్నారని ఆ వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతపై సోమవారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విస్తృతంగా చర్చించారని పేర్కొన్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement