
గజ్వేల్, మలక్‌పేట ఏరియా దవాఖానలను సందర్శించిన కేంద్ర బృందం
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన మిడ్వైఫరీల సేవలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (నర్సింగ్) డాక్టర్ రతి బాలచంద్రన్ ప్రశంసించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్, హైదరాబాద్‌లోని మలక్‌పేట ఏరియా దవాఖానలను కేంద్ర బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిడ్‌వైఫరీలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులు గర్భిణులకు అవగాహన కల్పించడంతోపాటు, సాధారణ ప్రసవాలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖను, ఈ సేవల్లో పాల్గొంటున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నర్సులకు ప్రత్యేకంగా 18 నెలల మిడ్వైఫరీ శిక్షణ కోర్సును 2017లో ప్రారంభించింది. మొదటి బ్యాచ్‌లో 30 మంది నర్సులకు శిక్షణ ఇచ్చారు. వీరిని రాష్ట్రవ్యాప్తంగా 17 ఆరోగ్య కేంద్రాల్లో నియమించారు. ప్రస్తుతం రెండో బ్యాచ్ శిక్షణ కొనసాగుతున్నది.