భీమ్గల్, జూన్ 27: ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి అమలుచేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు భీమ్గల్ మండల కేంద్రంలో యూనియన్ నాయకులతో కలిసి ఎంఈవో, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. అనంతరం ఆయా కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు నెలకు రూ. 10 వేల వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు.రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కార్మికులు చనిపోతే అంత్యక్రియల ఖర్చులు చెల్లించాలని కోరారు. నిత్యావసర వస్తువులు, సరుకులతోపాటు గ్యాస్, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మండల బాధ్యులు చిన్నూబాయ్, స్వప్న, లలిత, రమా, మంజుల, గోవింద్, బుచ్చవ్వ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.