కోల్‌కతాతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాపార్డర్ మరోసారి విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (3) పేవల ఫామ్ కొనసాగించగా.. కొంత ఆశలు రేపిన డెవాల్డ్ బ్రెవిస్ (29) ఫర్వాలేదనిపించాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ (14) ఈసారి సత్తా చాటలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి బంతిని భారీ షాట్ ఆడేందుకు బ్రెవిస్ ప్రయత్నించి మిస్ అయ్యాడు.
ఆ బంతిని అందుకున్న కీపర్ బిల్లింగ్స్.. చటుక్కున స్టంపింగ్ చేశాడు. దీంతో బ్రెవిస్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (26 నాటౌట్)తో కలిసి ఇషాన్ కిషన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. కానీ 11వ ఓవర్లో కమిన్స్ వేసిన బంతిని పుల్ చేసేందుకు కిషన్ ప్రయత్నించాడు. అయితే నేరుగా తనవైపు దూసుకొచ్చిన బంతిని శ్రేయాస్ అయ్యర్ వదలకుండా పట్టేయడంతో కిషన్ కూడా అవుటయ్యాడు.
ఈ క్రమంలో సూర్యకుమార్‌కు జత కలిసిన తిలక్ వర్మ (6 నాటౌట్) ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 79/3 స్కోరుతో నిలిచింది.