మన్సూరాబాద్, మే 3: ప్రతి యాదవ విద్యావంతుడు ఒక పేద విద్యార్థిని దత్తత తీసుకొని, వారి ఉన్నత చదువులకు చేయూతనివ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పిలుపునిచ్చారు. లోక కల్యాణం కోసం యాదవులు సంఘటితంగా ముందుకు సాగాలని కోరారు. యాదవ విద్యావంతుల వేదిక, అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాగోల్‌లో నిర్వహించిన యాదవుల ఆత్మగౌరవ సభ లో ఆయన మాట్లాడారు.
యాదవులకు మహాభారతానికి ఉన్నంత చరిత్ర ఉన్నదని, దీనిని యువతరం తెలుసుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నీతి నిజాయితీకి యాదవులు మారుపేరని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పారని, అంతటి గొప్ప జాతిలో పుట్టినందుకు యాదవులంతా గర్వపడాలని పేర్కొన్నారు. యాదవ విద్యావంతుల వేదిక కన్వీనర్ చలకాని వెంకట్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ కెప్టెన్ అజయ్సింగ్యాదవ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, నోముల భగత్‌యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్‌యాదవ్, గొర్రెల, మేకల అభివృద్ధి సమాఖ్య కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.