అమీన్‌ఫూర్, సెప్టెంబర్ 26: సంగారెడ్డి జిల్లాలోని ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో నిర్వహించిన జాబ్‌మేళా విజయవంతమైంది. శుక్రవారం అమీన్పూర్ మున్సిపాలిటీ పటేల్‌గూడలో నిర్వహించిన ఉద్యోగమేళాను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ చైర్మన్ వి.బాలకృష్ణారెడ్డి, జేఎన్టీయూ రెక్టార్ డాక్టర్ కే విజయ్‌కుమార్, ఎల్లంకి ఇంజినీరింగ్ కాలేజీ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఈ సదాశివరెడ్డి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన 2 వేల మంది విద్యార్థులు ఈ జాబ్‌మేళాకు హాజరయ్యారు.
30 ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఉద్యోగార్థులను ఇంటర్వ్యూలు చేశారు. ఈ ఇంటర్వ్యూల్లో అధిక శాతం మంది ఎంపికయ్యారని కాలేజీ వర్గాలు తెలిపాయి. త్వరలో ఆ కంపెనీలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా రెక్టార్ జేఎన్టీయూ విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందజేస్తున్న సంస్థలకు ఆదరణ ఉంటుందన్నారు. కాలేజీ యజమాన్యం ప్రైవేట్ కంపెనీలతో ఎంవోయూ చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు.
ఇలాంటి ఉద్యోగమేళాలు కళాశాల విద్యను పూర్తి చేసుకున్న అభ్యర్థుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని పేర్కొన్నారు. సెక్రటరీ ఎస్బీటీఈటీ ఎ.పుల్లయ్య మాట్లాడుతూ .. డిప్లొమా చేసిన విద్యార్థులకు వందశాతం ప్లేస్‌మెంట్స్ అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఎస్బీటీఈటీ రూపొందించిన అప్డేట్ సిలబస్‌ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కమిటీ ఎలాంటి మార్పు లేకుండా ఆమోదించిందని గుర్తుచేశారు. కళాశాల చైర్మన్ డాక్టర్ ఈ.సదాశివరెడ్డి మాట్లాడుతూ అధిక సంఖ్యలో విద్యార్థులు ఉద్యోగమేళాకు హాజరయ్యారని, అత్యధిక శాతం మంది సక్సెస్ అవబోతున్నారని తెలిపారు.
ఎల్లంకి కళాశాల ఉపాధి కల్పన, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. జేకే ఫెన్నార్, ఎంఆర్ఎఫ్, యూనిక్ బయోటెక్, క్వెస్, ఉషాకిరణ్ మూవీస్, ఏషియన్ పెయింట్స్, బీడీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, బీహెచ్ఈఎల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్ఎఫ్సీఎల్ సంస్థలు హాజరై ఇంటర్వ్యూలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎం.సాంబశివారెడ్డి, సెక్రటరీ ఈ దయాకర్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, రాజమని, సాయి కిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.