Prajwal Samrit | పుణే, మే 22: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రెండు ఐఐఎంలలో వచ్చిన ఎంబీఏ సీట్లను కాదని దేశానికి సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నాడు మహారాష్ట్రకు చెందిన అమరవీరుడి కుమారుడు ప్రజ్వల్ సమ్రిత్. ప్రజ్వల్ తండ్రి లాన్స్ నాయక్ కృష్ణాజీ సమ్రిత్ 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమరుడయ్యారు. తండ్రి మరణించే నాటికి ప్రజ్వల్ 45 రోజుల పసికందు. దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రిబాటలోనే తాను పయనించడానికి ఆర్మీలో చేరాలని కలలు కనేవాడు. మహారాష్ట్రలోని వార్దా జిల్లా పుల్గాన్ తెహ్సిల్‌లో తల్లి సరిత, అన్నయ్య కునాల్‌తో నివసిస్తున్నాడు. ఎంటెక్ పూర్తి చేసిన అన్నయ్య పుణేలో ఉద్యోగం చేస్తుండగా ప్రజ్వల్ బీఎస్సీ చదివాడు.
తర్వాత మిలటరీ చేరేందుకు నిర్వహించే ఎస్ఎస్బీ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అంతేకాకుండా మెడికల్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. దీంతో జూలైలో డెహ్రాడూన్‌లోని మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తయ్యాక లెఫ్ట్‌నెంట్ హోదాలో చేరాల్సి ఉంది. అదే సమయంలో దేశంలోని ఐఐఎంలలో ప్రవేశానికి ఇటీవల నిర్వహించిన ‘క్యాట్’ పరీక్షలో ప్రజ్వల్ 97.51 పర్సంటైల్ సాధించాడు. దీంతో ఆయనకు ఐఐఎం ఇండోర్, ఐఐఎం కోజికోడ్‌లలో చేరమని ఆఫర్ లెటర్లు వచ్చాయి. ఐఐఎంలో ఎంబీఏ చదివి ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ తాను ఆర్మీలోనే చేరి తన తండ్రిలా సేవచేస్తానని ప్రజ్వల్ చెప్పడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.