హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా కల్లూరులోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన నలుగురు నిరుపేద విద్యార్థులు నిఖిల్, సాహితీ, క్రిష్ణవేణి, అక్షర మెడిసిన్‌లో మెరిశారు. కటిక పేదరికం అడ్డొచ్చినా కష్టపడి చదివి ప్రఖ్యాత ఉస్మానియా, గాంధీ, మల్లారెడ్డి, భాస్కర్ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించారు. వీరిలో నిఖిల్, క్రిష్ణవేణి కుంటుంబాలది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి కాగా.. సాహితీ, అక్షర ఉపాధ్యాయుల పిల్లలు. వీరంతా ఒకే ఊరు, ఒకే కాలనీకి చెందినవారు కావడం గమనార్హం.
సీటైతే వచ్చింది కానీ..
మేం ఇద్దరు అక్కా చెల్లెళ్లం. 1 నుంచి 10వ తరగతి వరకు కల్లూరులో, ఇంటర్ హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో చదివాను. మా అక్క గురుకులంలోనే చదివింది. ఇంతకుముందు మా కుటుంబంలో ఎవరూ డాక్టర్లు లేరు. మెడిసిన్‌లో సీటు సాధించింది నేనే. ఇది చాలా సంతోషాన్ని కలిగిస్తున్నా.. ఫీజులు ఎలా చెల్లించాలన్న బాధ వెంటాడుతున్నది. మా తల్లిదండ్రులిద్దరూ రోజూ కూలి పనికి వెళ్తేనే కుటుంబం గడుస్తుంది.
– కృష్ణవేణి, మల్లారెడ్డి వైద్య కళాశాల, సూరారం
పట్టుదలతో చదివాను
మాది పేద కుటుం బం. పట్టుదలతో చదివాను. 1 నుంచి 5 వరకు కల్లూరులో, 6 నుంచి ఇంటర్ వరకు అన్నపురెడ్డిపల్లి గురుకులంలో చదివాను. నా ప్రతిభను గుర్తించి మా టీచర్లు హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో నీట్ కోచింగ్‌కు పంపారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు సాధించాను. కానీ ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎవరైనా దాతలు సాయం చేస్తే బాగుంటుంది.
– గోట్రు నిఖిల్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్
పీజీ చేయడమే లక్ష్యం
డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచే కోరిక ఉండేది. అందుకే పట్టుదలతో చదివి గాంధీ వైద్య కళాశాలలో సీటు సాధించాను. తొలి విడత కౌన్సెలింగ్‌లోనే సీటు రావడం చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. మా కాలనీలో ఒకేసారి నలుగురికి మెడికల్ సీట్లు రావడంతో స్థానికులంతా అభినందిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత పీజీ చేయడం నా లక్ష్యం.
– వేము సాహితీ, గాంధీ వైద్య ,కళాశాల, సికింద్రాబాద్
కోచింగ్ తీసుకోకుండానే సాధించా
ఇంటర్లో 97.5% మార్కులు సాధించా. నీట్ కోచింగ్ తీసుకోకుండానే మెడిసిన్ సీటు కైవసం చేసుకొన్నా. డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచే నాన్న చెప్తుండేవారు. అదే ప్రోత్సాహంతో చదివాను. మా కాలనీ నుంచి నాతోపాటు మరో ముగ్గురికి మెడిసిన్ సీట్లు లభించాయి. కానీ క్రిష్ణవేణి, నిఖిల్ కుటుంబాలు చాలా పేదరికంలో ఉన్నాయి. వారికి ఎవరైనా అండగా ఉంటే బాగుంటుంది.
– వరక అక్షర, భాస్కర్ మెడికల్ ,కళాశాల, సికింద్రాబాద్