మేడ్చల్ : న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ యువతికి మాయమాటలు చెప్పి ఓ కానిస్టేబుల్ లోబరచుకున్నాడు. మెల్లిగా మాటలు కలిపి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో సదరు కానిస్టేబుల్ అసలు స్వరూపం బయటపెట్టాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో.. కానిస్టేబుల్, అతని భార్య, సహకరించిన మరో కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
వివరాల్లోకి వెళితే… మేడ్చల్‌లో నివాసం ఉండే ఓ యువతి తనకు రావాల్సిన డబ్బుల విషయంలో ఒకరితో వివాదం ఏర్పడింది. ఈ విషయంపై గతేడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో సదరు యువతితో నేర విభాగంలో పనిచేసే కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి(31) మాటలు కలిపాడు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే డబ్బులు రావని.. డబ్బులు రావడానికి తాను సహకరిస్తానని నమ్మబలికి యువతి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఓ లాయర్‌ను కలుద్దామని చెప్పి సదరు యువతిని పిలిపించుకున్నాడు.
ఇంటికి వచ్చిన యువతితో తనకు ఇంకా పెళ్లి కాలేదని సుధాకర్ రెడ్డి తెలిపారు. అంగీకరిస్తే ఆమెను పెళ్లిచేసుకుంటానని పేర్కొన్నారు. కానీ అందుకు సదరు యువతి అంగీకరించలేదు. ఇప్పటికే తాను మోసపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని.. ఇప్పుడు పెళ్లి చేసుకోలేనని కానిస్టేబుల్‌తో సదరు యువతి చెప్పింది. అయినప్పటికీ ఆమెపై సుధాకర్ రెడ్డి ఒత్తిడి చేశారు. తనకు కులపట్టింపులు ఏమీ లేవని పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెబుతూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత 15 రోజులకు మళ్లీ ఇంటికి పిలిపించుకుని లైంగిక దాడి చేశాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకుని ఆమెను బెదరిస్తూ పలు మార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో సదరు యువతి గర్భం దాల్చింది.. ఈ విషయం సుధాకర్ రెడ్డికి చెప్పగా.. బలవంతంగా మందులు మింగించి గర్భస్రావం అయ్యేలా చేశాడు.
ఈ క్రమంలోనే గత ఏడాది ఆగస్టు 15వ తేదీన సుధాకర్ రెడ్డికి బాధిత యువతి ఫోన్ చేయగా.. అతని భార్య కాల్ లిఫ్ట్ చేసింది. దీంతో సుధాకర్ రెడ్డికి పెళ్లయ్యిందని తెలిసి.. అతన్ని నిలదీసింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే నవంబర్ 23న ఆ యువతిని సుధాకర్ రెడ్డి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై సుధాకర్ రెడ్డి భార్య సింధూజ దాడికి పాల్పడింది. మరోసారి తన భర్త వెంట పడితే చంపేస్తానని బెదిరించింది. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో.. తన స్నేహితుడైన కానిస్టేబుల్ కల్యాణ్ గౌడ్‌తో కలిసి ఆమెను బెదిరించాడు. డిసెంబర్ 10వ తేదీన మరోసారి తాగిన తర్వాత బాధితురాలి ఇంటికెళ్లి గొడవ చేశారు. ఆ తర్వాత ఆరు రోజులకు గిర్మాపూర్‌కు వెళ్లే దారిలో బుల్లెట్‌పై తీసుకెళ్లి కిందకు తోసేశాడు. కానిస్టేబుల్ వ్యవహారం తెలియడంతో పోలీసు అధికారులు అతన్ని సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ క్రమంలోనే సుధాకర్ రెడ్డి ప్రవర్తనతో విసిగిపోయిన బాధిత యువతి ఈ నెల 4వ తేదీన మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి, అతని భార్య సింధూజ, సహకరించిన మరో కానిస్టేబుల్ కల్యాణ్ గౌడ్‌పై కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.