
సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సెయిలింగ్‌లో తెలంగాణ యువత అత్యధిక పతకాలు సాధించి రాష్ర్టానికి గర్వకారణంగా నిలిచారు. రాష్ట్రం ఏర్పడ్డాక 100కు పైగా పతకాలు సాధించినట్లు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నిర్వాహకులు శనివారం తెలిపారు. ముంబైలో ఇటీవల నిర్వహించిన నేషనల్ సెయిలింగ్ పోటీల్లో ఒక్కొక్కరు రెండేసి పతకాలను సాధించి శెభాష్ అనిపించుకున్నారు. వైష్ణవి వీర వంశం అండర్-15, ప్రీతి కొంగర అండర్-17 విభాగాల్లో రెండు కాంస్య పతకాలను సాధించారు. వీరిద్దరూ వచ్చే నెల (ఫిబ్రవరి)లో అబుధాబిలో జరగనున్న ఏషియన్ రెగట్టాలో పాల్గొననున్నారు.
ఇటీవల ముగిసిన వైఏఐ సెయిల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ ఈవెంట్లో నేవీకి చెందిన 24 ఏండ్ల శేఖర్ కాంస్యం సాధించాడు. రవళి పరండి, ఝూన్సీ ప్రియ లావేటి అండర్ -15లో రెండు పతకాలతో నిలిచారు. వీరందరూ 10 ఏండ్ల వయస్సులో క్లబ్లో చేరి 16 ఏండ్లు దాటక ముందే జాతీయ స్థాయి ర్యాంకింగ్‌లో అగ్ర స్థానానికి చేరువయ్యారని యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఫౌండేషన్ అధ్యక్షుడు సుహేమ్ షేక్ పేర్కొన్నారు. 2016లో సెయిలింగ్ విభాగంలో బాలికలను ప్రోత్సహించేందుకు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఇందుకు 100 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. అందులో 12 మందికి శిక్షణ ఇచ్చి ఉన్నతంగా తీర్చిదిద్దామని క్లబ్ అధ్యక్షుడు సుహేమ్ షేక్ పేర్కొన్నారు.