మెదక్ మున్సిపాలిటీ, మార్చి 3 : మెదక్ పట్టణానికి చెందిన రెంజూకి షోటోకాన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నగేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. కరాటేలో గిన్నిస్ వరల్డ్ రికార్డుగా చెప్పుకునే బోధి వరల్డ్ రికార్డ్స్‌లో ఆయన స్థానం సంపాదించారు. ఫిబ్రవరి 8వ తేదీన చెన్నైని తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ కరాటే మా స్టార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోధి వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమంలో 3 వేల మంది కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. ఇందులో నగేశ్ వద్ద శిక్షణ పొందిన 40 మంది కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కరాటేను వృత్తిగా భావించి కరాటేలో ఎంతోమందికి శిక్షణ ఇస్తున్న నగేశ్‌కు బోధి వరల్డ్ రికార్డులో స్థానం కల్పించారు.
కరాటే శిక్షణలో నగేశ్ గత 35 ఏండ్లుగా సేవలు అందిస్తున్నారు. మెదక్‌లో రెంజూకి షోటోకాన్ కరాటే క్లబ్ సంస్థను స్థాపించి తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వేలాది మంది యువకులకు కరాటేలో శిక్షణ అందించారు. ఈ క్రమంలోనే ఆయనకు బోధి వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ఈ క్రమంలోనే ఈ నెల 2న హైదరాబాద్‌లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా బోధి వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా కరాటే గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించిన నగేశ్‌ను పలువురు అభినందించారు.