రామాయంపేట, ఏప్రిల్ 4: సర్కారు బడికి ఇక మంచి రోజులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ విద్యావిధానంలో అనేక మార్పులు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే మరో ప్రతిష్టాత్మకమైన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాలలో పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగి, ఇప్పటికే విద్యాశాఖ అధికారులు మొదటి విడుతగా పలు పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో రామాయంపేట పట్టణం బీసీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కూడా ఎంపికవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సౌకర్యాల కల్పన..
గతంలో రామాయంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఎవరూ పట్టించుకోక పోవడంతో సౌకర్యాల లేమి, మురుగు నీటి ప్రవాహం ఇక్కడ నుంచే వెళ్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి మురుగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, కౌన్సిలర్ గజవాడ నాగరాజు స్థానికంగా సీసీ డ్రేన్లను నిర్మించి సమస్యను పరిష్కరించారు. అంతేకాకుండా విద్యార్థులకు పలు మౌలిక వసతులను కల్పించడంతో ప్రస్తుతం పాఠశాలలో 103 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
‘మనఊరు-మనబడి’తో మారనున్న రూపురేఖలు
విద్యాశాఖ అధికారులు బీసీ కాలనీ పాఠశాలను ‘మనఊరు-మనబడి’కి ఎంపిక చేశారు. పాఠశాల స్థితిగతులను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాఠశాల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కూడా మంజూరు చేస్తానని మున్సిపల్ పాలకవర్గానికి హామీ ఇచ్చారు. పాఠశాలకు రెండు అదనపు గదులు, మరో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించనున్నట్లు అధికారులు తెలిపారు.
పాఠశాలను ఆదర్శంగా మారుస్తా
నా వార్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు మున్సిపల్ చైర్మన్, మెదక్ ఎమ్మెల్యే ద్వారా అభివృద్ధి పరుస్తాను. ప్రస్తుతం పాఠశాలకు రెండు అదనపు గదులు మంజూరయ్యాయి. పాఠశాలలో ప్రభుత్వ టీచర్లు వచ్చే వరకు ఇద్దరు వలంటీర్లను నియమిస్తాం. పాఠశాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా.
– గజవాడ రాజు, కౌన్సిలర్ రామాయంపేట
పాఠశాలకు కమిటీ ఏర్పాటు చేసి ఖాతా తీశాం..
బీసీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలకు చైర్మన్‌తో పాటు ఐదుగురి కమిటీ వేసి అభివృద్ధి పనులకు నిధులు వచ్చేలా బ్యాంకులో ఖాతాను తెరిచాం. మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, కౌన్సిలర్ రాజు కృషి వల్లే నేడు పాఠశాలకు విద్యార్థులు చక్కగా వస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరిగింది, ‘మన ఊరు-మనబడి’తో విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.
– శ్రీనివాస్, హెచ్ఎం
ఇంగ్లిష్ చక్కగా బోధిస్తాం..
ప్రభుత్వ పాఠశాల ‘మన ఊరు-మనబడి’కి ఎంపిక కావడం గొప్ప విషయం. ప్రభుత్వం పాఠశాలకు సౌకర్యాలను కల్పిస్తున్నది. సంతోషంగా ఉంది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌లోనే విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధన చేపడుతాం.
– పుష్పలత, ఉపాధ్యాయురాలు
ఇంగ్లిష్ నేర్చుకుంటాం
మా సార్లు ఇప్పటికే ఇంగ్లిష్‌లో బోధన చేస్తున్నారు. మేము ఇంకా ఇంగ్లిష్ నేర్చుకుంటాం. గతంలో ప్రైవేట్ పాఠశాలలో చదివేవాళ్లం. ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాం. మాకు ఇక్కడ టీచర్లు ఇంగ్లిష్‌లో చక్కగా పాఠాలు చేప్తున్నారు.
– కల్యాణి, ధన్రాజు, ఐదో తరగతి విద్యార్థులు