
చేర్యాల, అక్టోబర్ 30 : నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషనర్ మరో అవకాశాన్ని కల్పించింది. 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన వారు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ప్రస్తుతం ఓటరు జాబితాలో తప్పులను సవరించేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతించింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఓటరుగా నమోదై మృతిచెందినా, స్వగ్రామం నుంచి వలస వెళ్లిన వారిని గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలిగించాల్సి ఉంది. కొత్త ఓటరు నమోదుతో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, నవంబర్ 1న ఓటరు ముసాయిదా ప్రదర్శన, జనవరి 5న తుది జాబితా ప్రకటించనున్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకతో పాటు హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాల్లో 11,25,846 మంది ఓటర్లు ఉన్నారు. జనగామ నియోజకవర్గంలో 2,21,617, హుస్నాబాద్‌లో 2,36,448, సిద్దిపేటలో 2,18,817, దుబ్బాకలో 1,97,468, గజ్వేల్‌లో 2,51,496 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం కల్పించడంతో ఓటర్లు సంఖ్య మారుతుందని అధికారులు తెలుపుతున్నారు.
నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా
జిల్లాలో గత నెల 30వ తేదీ వరకు జరిగిన ఓటర్లు నమోదు, తొలిగింపు, చేర్పులు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి నవంబర్ 1వ తేదీన ఓటరు ముసాయిదా జాబితా ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రతులను జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ముసాయిదాలో పేర్లు మార్పు, ఫొటో లేకపోవడం, ఇతర సమస్యలపై 2వ తేదీ నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు, డిసెంబర్ 20వ తేదీ వరకు పరిశీలన పూర్తిచేసి 2022 జనవరి 5న తుది జాబితా విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌గోయల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లు తమ నివాస గృహాలు మారడం, అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, మరో చోటుకు మార్పు అవసరమైన సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై వారి ఆమోదంతో మార్పులకు సిఫారసు చేసేలా ఎన్నికల కమిషనర్ అవకాశం కల్పించారు.
‘గరుడ’ యాప్‌లో నమోదు..
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, పోలింగ్ స్టేషన్ల వివరాలతో కేంద్ర ఎన్నికల సం ఘం ‘గరుడ’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బూత్ లెవల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేసే క్రమంలో తలెత్తే సమస్యలను గమనించిన ఎన్నికల సంఘం, ఈ ప్రక్రియను క్షేత్రస్థాయి నుంచి ఆన్లైన్ విధానంలోకి మార్చింది. బీఎల్వోలు మొదట పోలింగ్ కేంద్రాల ఫొటోలను యాప్‌లో డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఉన్న వసతి సౌకర్యాలను నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పు లు, కొత్త ఓటర్ల నమోదు సైతం గరుడ యాప్‌లోనే చేపట్టేలా మార్గదర్శకాలు జారీచేసింది.
ఓటరు నమోదు ఇలా..
నూతన ఓటర్లు మీ-సేవ, ఇంటర్నెట్, ఎన్‌వీఎస్‌వీ వెబ్‌సైట్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రిజిస్ట్రేషన్ కోసం ఫారం-6, అసెంబ్లీ నియోజకవర్గ మార్పు కోసం ఫారం-6, అసెంబ్లీ నియోజకవర్గంలో చిరునామా మారిన సమయంలో ఫారం-8ఏ, సవరణకు ఫారం-8, ఓటరు జాబితాలో పేరు తొలిగింపునకు ఫారం-7లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ వీడియో కాన్పరెన్స్‌లో కలెక్టర్లు, అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.