
మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 29 : జిల్లాలో జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించిన బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, స్టడ్స్, బ్లింకర్ లైట్లు, కల్వర్టర్లు అండర్ పాస్‌ల వద్ద రేడియం స్టిక్కర్లు, టీ ఎండ్ గల రోడ్డు ప్రాంతాల్లో సైన్ బోర్డులు పెట్టాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రధానంగా జంక్షన్లు, యూటర్న్లు, పాదచారులు రోడ్డు దాటే సమయంలో వేగంగా వెళ్లడం, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం, చిన్న, పెద్ద రోడ్లు కలిపే ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు.ప్రమాదంలో మృతి చెందిన సంఖ్యను బట్టి ఏ, బీ, సీ ని మూడు క్యాటగిరి బ్లాక్ స్పాట్లుగా విభజించామని అందుకనుగుణంగా అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. తూఫ్రాన్ జాతీయ రహదారుల వెంట రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లఘించినా డాబా హోటళ్లకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, పోలీసు శాఖ అధికారులకు ఆదేశించారు. ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా రామాయంపేట, తుఫ్రాన్, నర్సాపూర్ వంటి ప్రధాన రహదారుల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నందున రోడ్డు భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వ్యర్థా ల వల్ల కాలుష్యానికి కారకులవుతున్నారని, పోలీసు శాఖ, అటవీ శాఖ, రవాణా శాఖ, ఆర్అండ్బీ అధికారులు సమష్టిగా గుర్తించి వైల్డ్‌లైఫ్, జాతీయ రోడ్డు భద్రత వయొలెన్స్ వంటి కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఆదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఏఎస్పీ కృష్ణమూ, డీటీవో శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్, జాతీయ రహదారి ఈఈ ధర్మారెడ్డి, తరుణ్ కుమార్, ఆర్అండ్బీ ఈఈ శ్యామ్ సుంద, మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు నిబంధనలు పాటించాలి
ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించాలని జిల్లా ఆదనపు జిల్లా రవాణాధికారి శ్రీనివాస్‌గౌడ్, ఏఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల నిమిత్తం శుక్రవారం నర్సాపూర్ రూట్లో కిష్టపూర్ వద్ద జరుగుతున్న ప్రమాదాల గురించి ఆరా తీశారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూ చించారు. వారి వెంట మెదక్ డీఎస్పీ సైదులు ఉన్నారు.