
రామాయంపేట, అక్టోబర్ 29 : భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి కోసం రైతులను ముంచేందుకు కొత్త చట్టాన్ని తేవడమే కాకుండా హుజూరాబాద్‌లో ఎలాగైనా ఓడిపోతామనే దురుద్దేశంతో దొంగ దీక్షలకు పాల్పడుతున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలో హైదరాబాద్‌కు చెందిన రోటరీ క్లబ్ అధ్వర్యంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బంధువులు వారి తాత దామరచెరువు గ్రామానికి చెందిన దివంగత నూలి హనుమంతరావు జ్ఞాపకార్థ్దం 12 బెడ్లతో నిర్మించిన ఐసీయూ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అమెరికా నుంచి దివంగత నూలి హనుమంతరావు మనుమలు, మనుమరాళ్లు ఎమ్మెల్యేతో ఆన్లైన్ వీడియోలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సరిగ్గా లేవని, రైతులను ముంచడం కోసం కొత్త చట్టాన్ని తెచ్చి వరి ధాన్యం కొనకుండా చేసిందన్నారు. ఆరేండ్ల నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్, ఏఎంసీల ద్వారా మద్దతు ధర ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. రైతు వద్ద గింజ కూడా లేకుండా ధాన్యం విక్రయాలను జరుపుతున్నామని అన్నారు. ఈ రోజు రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామంటే అది కేవలం సీఎం కేసీఆర్ ఇస్తున్న భరోసాయేనని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 311 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. వానకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం 5లక్షల మెట్రిక్ టన్నులను రైతు వద్ద గింజకూడా ఉండకుండా కొంటామన్నారు.
మంత్రి కేటీఆర్ బంధువుల తాత జ్ఞాపకార్థం
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బంధువులు వారి తాత దామరచెరువు గ్రామానికి చెందిన దివంగత నూలి హనుమంతరావు జ్ఞాపకార్థం మనుమలు, మనుమరాళ్లు హైదరాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 12బెడ్ల ఐసీయూ కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మనుమలు, మనుమరాళ్లు రాధిక, రాజు ఆస్ట్రేలియా, అమెరికా నుంచి ఎమ్మెల్యేతో ఆన్లైన్లో మాట్లాడారు. తమ సొంతూరుకు ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చామని, రామాయంపేట మండల కేంద్రం హైవేకు ఆనుకుని ఉండడంవల్ల ప్రమాదాల జరిగినప్పుడు క్షతగాత్రుల ప్రాణాలను రక్షించేందుకు తాము ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ద్వారా చేపట్టామన్నారు. గతంలో రామాయంపేటలో రైతువేదిక నిర్మాణం కోసం రూ.40లక్షలను అందజేశామని వారు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు, రోటరీ క్లబ్ హైదరాబాద్ జిల్లా గవర్నర్ ప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ శిరీష, అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చం ద్రం, ఏడీఏ వసంత సుగుణ, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, తాసీల్దార్ శేఖర్‌రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజు, కౌన్సిలర్లు దేమె యాదగిరి, బొర్ర అనిల్, గంగాధర్ తదితరులు ఉన్నారు.