
మర్కూక్, అక్టోబర్ 29: గ్రామాలు ప్రకృతి వనాలుగా మారాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి పనులు చేపట్టింది. ప్రతి పంచాయతీకి నర్సరీని కేటాయించింది. పెద్ద పంచాయతీల్లో రెండేసి నర్సరీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటిస్తున్నది. వనసంరక్షకులు మొక్కల సంరక్షణలో కీలక పాత్ర వహిస్తున్నారు. మొక్కలు నాటుతూ.. నీళ్లు పడుతూ గ్రీన్ వారియర్స్‌గా పనిచేస్తున్నారు. నర్సరీల ఏర్పాటు ద్వారా ఎంతో మందికి ఉపాధి దొరుకుతున్నది.
16 గ్రామాల్లో పరిఢవిల్లిన పచ్చదనం
మండలంలోని 16 గ్రామాల్లో ఎటుచూసినా పచ్చదనంతో పరిఢవిల్లుతున్నది. రోడ్లకు ఇరువైపులా నాటిన మొ క్కలు ఏపుగా పెరిగాయి. పచ్చని చెట్లు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామాలకు పచ్చని తోరణాలుగా మారా యి. ఒక్కో విడుతలో గ్రామానికి 40 వేల మొక్కలు నాటారు.
పల్లె రూపురేఖలను మార్చిన ప్రకృతి వనాలు
గ్రామీణ ఉపాధిని పెంచాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన నరేగా పథకాన్ని పటిష్టంగా అమలు చేయడంలో సఫలీకృతులయ్యారు. హరితహారం అమలుతో ఎక్కడా చూసినా గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయి.
నాటి రైతు కూలీలే -నేటి వనసైనికులు
గత ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో పనిచేస్తున్న కూలీలు సాధారణ రైతు కూలీలుగా మిగిలారు. ప్రత్యేక డ్రెస్‌కోడ్, గుర్తింపు ఉండేది కాదు. ఉపాధికోసం అడ్డాకూలీలుగా ఉండిపోయారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వం మొక్కల సంరక్షణకు కొత మందిని వనసైనికులుగా గుర్తించి వారికి డ్రైస్‌కోడ్‌ను కేటాయించింది. మం డల వ్యాప్తంగా మొత్తం 56 మం దిని నియమించింది. నెలకు ఒక్కొక్కరికీ రూ.6 వేల చొప్పున వేతనం చెల్లిస్తున్నది.
ఏడాది పొడవునా ఉపాధి దొరికింది
గతంలో ఏ కూలినాలో చేసుకుంటూ ఉండేవాడిని. టీఆర్ఎస్ సర్కారు వొచ్చినంక రోజంతా పని దొరుకుతుంది. నెలకు రూ.6 వేలు వొస్తున్నయ్. ఇది వరకు పనికోసం పొద్దుగల్ల లేస్తే ఏం పనిచేయాలే అని చింత ఉండేది. ఇప్పుడు ఆ బాధ తప్పింది. మొక్కల సంరక్షకుడిగా ఉంటూ చెట్లకు పానంపోస్తున్నాను.
ఇస్తారి బాలయ్య, ఎర్రవల్లి, వనసంరక్షకుడు