
అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. మంచి వేతనం, అనేక సౌలతులు, మంచి కెరీర్. కానీ, అవేవి ఆ యువకుడికి సంతృప్తినివ్వలేదు.మాతృదేశంలోనే కుటుంబసభ్యులతో కలిసి ఉంటూ హాయిగా వ్యవసాయం చేసుకుంటే అందులో ఉండే సంతృప్తి మరెక్కడా ఉండదని భావించాడు. దీనికోసం అమెరికాను వదిలి స్వదేశానికి వచ్చాడు. సిద్దిపేటలోని తన ఇంటికి చేరుకుని వ్యవసాయ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ధూళిమిట్ట మండలం జాలపల్లిలో తమ కుటుంబానికి ఉన్న 30ఎకరాల భూమిలో తీరొక్క పంటల సాగుకు శ్రీకారం చుట్టాడు. ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ.. ఎప్పటికప్పుడు పంటమార్పిడి పాటిస్తూ వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు సిద్దిపేటకు చెందిన దుష్యంత్‌రెడ్డి.
ధూళిమిట్ట, అక్టోబర్ 28 : సిద్దిపేట జిల్లా కోహెడ ప్రాంతానికి చెందిన దుష్యంత్ రెడ్డి తల్లిదండ్రులు చాలాఏండ్ల క్రితం సిద్దిపేటకు వచ్చి స్థిరపడ్డారు. వారికి దూళిమిట్ట మండలం జాలపల్లిలో 30 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. దుష్యంత్‌రెడ్డి చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి అక్కడే కొన్నేండ్ల పాటు ఉద్యోగం చేశాడు. పుట్టిన ఊరంటే మమకారం, కుటుంబం, వ్యవసాయం అంటే ఇష్టంతో అమెరికాను వదిలి వచ్చాడు. 2017 నుంచి సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల పరిధిలోని జాలపల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో విభిన్న పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. నూతన వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వ్యవసాయంలో లాభాలు ఆర్జిస్తున్నాడు.
పలు రకాల పంటలు సాగు..
ముఖ్యంగా మన ప్రాంతాల్లో వ్యవసాయం అనగానే వరి, మొక్కజొన్న లాంటి పంటలే ఎక్కువగా సాగు చేస్తుంటారు. దుష్యంత్‌రెడ్డి మాత్రం అందరిలాగా కా కుండా విభిన్నంగా ఆలోచించాడు. పొప్పడి, మామిడి తోటల పెంపకానికి ప్రాధాన్యతిచ్చాడు. తనకున్న భూమిలో 4 ఎకరాల్లో బొప్పాయి పంట సాగుచేసి లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇటీవల మరో 6 ఎకరాల స్థలంలో హైబ్రిడ్ మామిడి మొక్కల పెంపకం మొదలు చేపట్టాడు. 6 ఎకరాల్లో శ్రీగంధం సాగు చేస్తున్నాడు. 2.5 ఎకరాల్లో బీర, 2.5 ఎకరాల్లో కాకర పందిరి తీగల విధానంలో సాగుచేస్తున్నాడు. వ్యవసాయ క్షేత్రంలో దారి పొడువునా స్థలం ఖాళీగా ఉంచకుండా కొబ్బరి చెట్లను పెంచుతున్నాడు. దీంతో క్షేత్రం కోససీమను తలపిస్తున్నది.
కూరగాయల సాగుతో సంతృప్తి
నిత్యవసరమైన కూరగాయలు పండించడం చాలా తృప్తినిస్తున్నదని దుష్యంత్ రెడ్డిఅంటున్నాడు. తన భూమిలో రెండున్నర ఎకరాల్లో కాకర, మరో రెండున్నర ఎకరాల్లో బీర వంటి కూరగాయలు నూతన పద్ధతుల్లో హైబ్రిడ్ విత్తనాలతో సాగుచేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. టమాటా, ఇతర పం టలు సైతం సాగు చేస్తున్నాడు. పంట మార్పి డి పాటించడం, నూత న విధానాలు అవలంబిస్తుండడంతో లాభాలు ఆర్జిస్తున్నాడు.
పలువురికి ఉపాధి..
తన క్షేత్రంలో ఏడాది పొడవునా పలు రకాల పంటలు, తోటలు సాగుచేస్తుండడంతో జాలపల్లి గ్రామంలో దాదాపుగా రోజూ 30 మందికి ఉపాధి లభిస్తున్నది. ఉదయం నుం చి సాయంత్రం వరకు వివిధ రకాల పంటల పెంపకానికి పనులు చేస్తుండడంతో తమకు ఉపాధి లభించడంతో పాటు వ్యవసాయంలో కొత్త విధానాలు తెలుస్తున్నాయనికూలీలు చెబుతున్నారు.
ఆర్థిక మంత్రి హరీశ్ రావు అభినందన..
యువరైతు దుష్యంత్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. అమెరికాలో మంచి కొలువు వదలుకొని వచ్చి ఆధునిక పద్ధతుల్లో తీరొక్క పంట లు సాగుచేస్తున్న దుష్యంత్‌రెడ్డిని మంత్రి అభినందించారు. ఈ విధంగానే గ్రామంలోని మిగతా రైతులను చైతన్యం చేయాలని ఆయనకు మంత్రి పిలుపునిచ్చారు.