
సదాశివపేట, అక్టోబర్ 27 : పల్లెలు ప్రగతిని సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా అన్నారు. బుధవారం మండల పరిధిలోని కోనాపూర్ గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రగతి వనం, డంపింగ్ యార్డు, వర్మీకంపోస్టు తయారీ కేంద్రాలను పరిశీలించారు. పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉంచి అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమం తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమం నాల్గో విడుత పూర్తి చేశామని, వాటిద్వారా పల్లెలు అభివృద్ధి చెందడంతో పాటు పారిశుధ్యం మెరుగుపడిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరాయంగా ఉంటుందని, ప్రతిరోజు మన ఇండ్లను శుభ్రం చేసుకున్నట్లే గ్రామాన్ని శుభ్రం చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సర్పంచ్‌లకు నిబంధనలు తీసుకురావడం జరిగిందని, నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో తప్పని సరిగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చయన్నారు. కాలుష్యం వస్తుందని పరిశ్రమల ఏర్పాటును ఆపవద్దని, పరిశ్రమలు వస్తేనే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు తప్పని సరిగా చెట్లు పెంచాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈవవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీపీవో సురేష్‌మోహన్, ఏపీడీ జయదేవ్, డీఎల్పీవో సతీష్‌రెడ్డి, పీఆర్ ఈఈ జగదీశ్వర్, ఎంపీడీవో పూజా, ఎంపీఈవో నారాయణ, కోనాపూర్ గ్రామ సర్పంచ్ శోభారాణి, ఎంపీటీసీ లలిత, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ తరాలను కాపాడుకుందాం..
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 27: భవిష్యత్ తరాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని, ఆరోగ్యకర సమాజాన్ని, స్వచ్ఛ వాతావరణాన్ని అందించాలని పంచాయతీరాజ్, రూరల్ డవెలప్మెంట్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా పిలుపునిచ్చారు. అధికారుల నిరంతర కృషితో ప్రజల్లో మార్పు వస్తుందన్నారు. బుధవారం జిల్లాలోని పలు గ్రామాలను పర్యటించిన అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, ఎంపీవోలు, ఏపీఏంలతో పల్లె ప్రగతి కార్యక్రమంపై ఆయన సమీక్షా నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రప్రథమంగా వైకుంఠధామాలను పూర్తి చేసిన జిల్లా సంగారెడ్డి అని, అందుకు కృషి చేసిన అధికారులందరినీ ఆయన అభినందించారు. పల్లె ప్రగతి దిశగా కృషి చేస్తే కార్యక్రమ ఉద్దేశం సఫలీకృతం అవుతుందన్నారు. గ్రామ పారిశుధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, సెగ్రిగేషన్ షెడ్లలో సెగ్రిగేషన్ జరిగి ఎరువు తయారు కావాలన్నారు. ప్రజల్లో మార్పుకోసం నిరంతరం ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ ఈజీఎస్ పనులు, అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రగతి వనాలు, నర్సరీలు, హరితహారంలో నాటిన మొక్కలు తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షీ షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జడ్పీ కొత్త భవనం అద్భుతం..
సంగారెడ్డి, అక్టోబర్ 27 : జిల్లా పరిషత్ నూతన భవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, పరిపాలన కూడా పారదర్శకంగా జరగాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్య కార్యదర్శి నూతనంగా నిర్మించిన జడ్పీ కొత్త భవనాన్ని సందర్శించారు. జడ్పీ చైర్ పర్సన్ మంజూశ్రీ జైపాల్‌రెడ్డి ముఖ్యకార్యదర్శి సుల్తానియాను శాలువా కప్పి మెమోంటోను అందజేసి సన్మానించారు. అనంతరం భవనంలోని గదులను పరిశీలించి ఏర్పాట్లు చాలా బాగున్నాయని కితాబిచ్చారు. ఉద్యోగుల పనితీరుతో మంచి పేరు వస్తుందని, ప్రజాప్రతినిధుల సహకారంతో పరిపాలనను వేగవంతం చేయాలని తెలిపారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డిప్యూటీ సీఈవో స్వప్న, సూపరింటెండెంట్ వేణుగోపాల్, సిబ్బంది ఉన్నారు.