e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News వైద్యసేవలకు వందనం

వైద్యసేవలకు వందనం

  • 113 ఏండ్లుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్న ‘మానెగళ్ల కుటుంబం’
  • అనేక జబ్బులకు వైద్యసేవలు
  • రాష్ట్రంతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రోగుల రాక
  • నామమాత్రపు ఫీజుతో వైద్యం
  • ఆదరిస్తున్న గ్రామీణ ప్రాంత జనం
  • సేవా కార్యక్రమాలతో చేయూత

ఏడాది రెండేండ్లు కాదు ఏకంగా ఆ కుటుంబం వందేండ్లుగా ఆయుర్వేద వైద్యసేవలు అందిస్తూ అనేక మంది రోగులకు జబ్బులు నయం చేసింది. నామమాత్రపు ఫీజు తీసుకుంటూ వీరు చేస్తున్న వైద్యం అనేక మంది రోగులకు స్వస్థత చేకూరుస్తున్నది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రోగులు వీరి వద్దకు వచ్చి వైద్యం పొందుతున్నారు. మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌ గ్రామానికి చెందిన మానెగళ్ల రామకిష్టయ్య కుటుంబం వందేండ్లుగా ఆయుర్వేద వైద్యసేవలు అందిస్తున్నది. ఈయన తాత, తండ్రి నుంచి వచ్చిన ఆయుర్వేద వైద్యాన్ని ఈయన కొనసాగిస్తున్నారు. మానెగళ్ల రామకిష్టయ్య కుమారులు సైతం ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు.

బొక్క విరిగి ఏడాది గడిచినా మంచానికే పరిమితమైన వారు సైతం రామాయంపేటకు వచ్చి వీరివద్ద ఆయుర్వేద వైద్యంలో బొక్కలను అతికించుకుని వెళ్తారు. వారసత్వంగా వచ్చిన మహత్యమో లేక వారి చేతిగుణమే తెలియదు కానీ మానెగళ్ల రామకిష్టయ్య వద్ద వైద్యం పొందిన వారు ఇట్టే కోలుకుంటారని ఈ ప్రాంతంలో పేరుంది. ఆయన చేతి వైద్యం అంటేనే ఈ ప్రాంత వాసులు ఎంతో ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ప్రమాదాల్లో బొక్కలు విరిగి నుజ్జునుజ్జు అయినా సరే మానెగళ్ల రామకిష్టయ్య ఆశ్రయిస్తే కాలుకు గాని, చేతికి గాని మెడికల్‌ పట్టీలను తొలగించి తనవద్ద ఉన్న ఆయుర్వేద మందులతో విరిగిన బొక్కలను సరిచేసి మళ్లీ కట్టుకడతాడు. కట్టిన రెండు రోజుల పాటు ఆయుర్వేద మందులు తాగిస్తుంటాడు. రెండు రోజుల తర్వాత విరిగిన బొక్కలు అతుక్కుంటాయి. ఏండ్ల తరబడి మంచాన పడ్డ వ్యక్తి సైతం వీరి వైద్యానికి లేచి నడుస్తారని పేరుంది. నడుము విరిగిన వాళ్లను రూంలోకి తీసుకుని పోయి మసాజ్‌ (ఫిజియోథెరపీ) చేస్తాడు. నలుగురు మోసుకెళ్లిన వ్యక్తి రామకిష్టయ్య మసాజ్‌తో రూమ్‌లో నుంచి లేచి ఒక్కడే నడచి వస్తాడు. ఇలా దశాబ్దాల కాలంగా కాళ్లు చేతులు, నడుము విరిగిన లక్షల మందిని నయం చేశారు. స్వగ్రామం ఝాన్సీలింగాపూర్‌లో ఉన్న ఆయుర్వేదిక్‌ దవాఖానను కొద్ది రోజుల క్రితం రామాయంపేటకు మార్చి తన కుమారులకు అప్పగించాడు మానెగళ్ల రామకిష్టయ్య. ఆయన మాత్రం సొంతూరిలోనే వైద్యం చేస్తున్నాడు. రెండు ప్రాంతాల్లో నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. వైద్యసేవలకు గాను వీరు రోగి నుంచి డబ్బులు డిమాండ్‌ చేయరు. రోగులు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. వైద్యసేవలు అందిస్తూనే రాజకీయాల్లోనూ మానెగళ్ల రామకిష్టయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఝాన్సీలింగాపూర్‌ సర్పంచ్‌గా పదేండ్లు బాధ్యతలు నిర్వర్తించాడు. మండలంలో పెండ్లిళ్లు, ఆపతి కాలంలో ఆయన నలుగురికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కరోనా ప్రభావం ఉన్నా

- Advertisement -

డోంట్‌వర్రీ…

కరోనాతో ప్రజలు భయాందోళనలకు గురవుతుంటే, మానెగళ్ల రామకిష్టయ్య వైద్యం అందిస్తున్న చోట షెడ్లలో ఉన్నవారికి మాత్రం ఎలాంటి కరోనా సోకలేదు. నెలల తరబడి షెడ్లలో ఉంటూ రోగులు వంటలు చేసుకుని తింటున్నారు. అయినా ఇంత వరకు అక్కడ ఎవరికీ కరోనా సోకలేదు. ఈ ప్రభావం అంతా ఆయుర్వేద వైద్యం మహత్యమని, మానెగళ్ల రామకిష్టయ్య చేతిగుణంతోనే మాకు కరోనా దరిచేరలేదని రోగులు చెబుతున్నారు. ఇక్కడ వివిధ రకాల ఔషధాలు, మూలికలతో ఒక రకమైన వాసన వస్తుంటుంది. ఈ వాసనకే తమకు ఏ రోగాలు దరిచేరవని అక్కడికి వచ్చిన వారు చెబుతుంటారు.

అనేక జబ్బులకు వైద్యం…

ఆయుర్వేద వైద్యం చేస్తున్న మానెగళ్ల రామకిష్టయ్య వద్దకు ఎక్కువ శాతం మంది నడుం నొప్పి, కీళ్లనొప్పులు, అర్షమొలలు, నల్లమచ్చలు, తెల్లమచ్చలు, పక్షవాతం, నరాల వీక్‌నెస్‌, మేయి కలుకలు, వీపు నరాలు పట్టడం వంటి సమస్యలతో వస్తుంటారు. ఎక్కువ శాతం కంప్యూటర్‌ ముందు కూర్చుని పనులు చేసేవారు బుజాల నొప్పులకు ఇక్కడ వైద్యం పొందుతారు.

తాతల కాలం నుంచి..

మా తాత, తండ్రి, ఇప్పుడు నేను, నా కొడుకులు ఆయుర్వేద వైద్యసేవలు అందిస్తున్నాం. బొక్కలు విరిగిన వారు మావద్దకు వైద్యానికి వస్తారు. నొప్పులకు, అర్షమొలలు, వివిధ రకాల రోగాలతో బాధపడుతుంటూ మావద్దకు వస్తుంటారు. మా కుటుంబం 113 ఏండ్లుగా ఆయుర్వేద వైద్యసేవలు అందిస్తున్నది. మా తాత 110 ఏండ్లు బతికిండు. మా నాయన 103 ఏండ్లు బతికిండు. ఇప్పుడు నేను 70ఏండ్లు ఉన్న. నేను నా కొడుకులం ఇప్పటికీ వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నాం. మా ఊరోళ్లు నా మీద నమ్మకంతో రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఎంతో మందికి వైద్యం చేసి రోగాల నుంచి నయం చేశాం. నాకు చేతనైనంత వరకు సమాజానికి సాయం చేస్తున్నా.

  • మానెగళ్ల రామకిష్టయ్య, ఆయుర్వేద వైద్యుడు, ఝాన్సీలింగాపూర్‌ (మెదక్‌ జిల్లా)

విరిగిన నా చేయి మంచిగైంది..

నా చేయి విరగడంతో దవాఖాన్ల చుట్టూ మస్తు తిరిగినం. ఏ డాక్టర్‌ దగ్గరికి పోయినా మందులు రాసిచ్చిండ్రు. నొప్పి తక్కువవుతుండె గాని విరిగిన బొక్క మాత్రం అతకలేదు. మా ఇంటిముందటైనా గిట్లనే రామన్న దగ్గరికి వస్తే కట్లు మంచిగ కడ్తడని చెప్పిండు. గందుకే ఇక్కడికి వచ్చి కట్టుకట్టించిన. ఇప్పుడు తక్కువైంది.

  • షేక్‌ మహ్మద్‌, తూప్రాన్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement