చేర్యాల టౌన్, నవంబర్ 17 : జ్యోతి జీవత్వానికి ప్రతీక. దేహానికి ప్రాణం, దేవాలయానికి దీపం శోభాయమానం. ఆకాశం వెలిగించిన చంద్రకాంతి దీప్తులు ఓ వైపు.. ప్రతిఇంటా పూసిన మట్టిచెమ్మెల దివ్వెలు మరోవైపు కార్తిక పున్నమిని కాంతివంతం చేస్తాయి. శివాలయాల్లో అభిషేకాలు.. బంధువులు, స్నేహితులతో వన భోజనాలు పున్నమి వేడుకను రెట్టింపు చేస్తాయి. నారాయణమూర్తి స్వరూపమైన కార్తిక మాసంలో సత్యవ్రతాలను నిర్వహిస్తూ భక్తిప్రపత్తులను చాటుకుంటారు. ధాత్రీ నారాయణమూర్తి తులసీ అమ్మవార్లకు వివాహం జరిపించి కన్యాదాన ఫలితాన్ని పొందుతారు. ముత్తైదువులు దీపదానాలు చేస్తారు. ధాత్రీనారాయణమూర్తిగా పరిగణించే ఉసిరిచెట్టు కింద భోజనాలు.. ఉసిరి కలిసిన నీళ్లతో స్నానం.. ఉసిరికాయపై చేసిన దీపదానం చేయడంతో ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మంచిదని ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం.
ఆత్మీయతలు పెంచే వన భోజనాలు..
కార్తిక పున్నమి నాడు వన భోజనాలకు తరలి వెళ్తారు. ప్రతి ఇంటి నుంచి ఫలహారాలు చేసుకొని సమీపంలోని దేవాలయాలు పచ్చిక బయళ్లకు బయలుదేరుతారు. ఉసిరి కొమ్మకు తులసీమాతకు లగ్నం చేసి కలిసి కూర్చొని భోజనాలు చేస్తారు. అన్న శాకాలతో పాటు ఆత్మీయతనూ పంచుకొని ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు.
సత్యదీక్షకు సూచిక సత్యనారాయణ వ్రతం..
నైమిశమనే అరణ్యంలో సూతమహాముని చెప్పిన సత్యవ్రతాన్ని కార్తిక పూర్ణిమ నాడు ఆచరించడం ద్వారా రెట్టింపు ఫలితం ఉంటుందన్నది శాస్ర్తాధారం. మానవ జీవనంలో సత్యం మాట్లాడడం.. ధర్మబద్ధ జీవనం గడపడంతో కలిగే శారీరక మానసిక ప్రశాంతతలను పొందేందుకు ఆస్తికులు కార్తిక పూర్ణిమ నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇండ్లలో భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించి సత్యదేవుడి అనుగ్రహాన్ని పొందుతారు. దేవాలయాల్లో సామూహిక సత్యవ్రతాల్లో పాల్గొని సహపంక్తి భోజనాలు చేస్తారు.
అజ్ఞానాన్ని నివారించే దీప ప్రకాశం..
కార్తిక మాసంలో సాయంకాలం పూట దీపాలు వెలిగించి ఇంటిముందు అలంకరిచడం సంప్రదాయం.అందంగా అలంకరించిన ఆకాశ దీపాలను ఇంటిపైన ఏర్పాటుచేసి అజ్ఞానపు చీకట్లను పారదోలే ప్రయత్నం చేస్తారు. పున్నమి నాడు దేవాలయాల్లో సామూహికంగా వివిధ ఆకృతుల్లో దీపాలు వెలిగించి భక్తిప్రపత్తులు చాటుకుంటారు.
శివకేశవులకు ప్రీతికరమైనది కార్తికమాసం. కార్తిక మాసానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. కార్తిక మాసంలో పౌర్ణమిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడు, విష్ణువు ఇద్దరికి ఇష్టమైన మాసం. శివకేశవులను తరిస్తే అంతా శుభం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ మాసంలో నెలరోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందుకే కార్తిక పౌర్ణమి రోజున విశేష పూజలు చేస్తుంటారు.
దీపదానం మహాపుణ్యం..
ఏ వ్రతమైనా, పూజ అయినా కార్త్తిక మా సంలో ఆచరించడంతో రెట్టింపు ఫలితం వస్తుంది. ఆలయాల్లో నిర్వహించడంతో అంతకు రెండింతల పుణ్యం వస్తుంది. అం దుకే ఈ మాసంలో దేవాలయాల్లో అభిషేకాలు, సత్యవ్రతాలు, దీపార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జ్ఞాన స్వరూపాలైన దీపాలను వెలిగించి అర్చకులకు దానం చేస్తారు.
“యస్మాత్ తస్మాత్ శివమ్మేష్యా అతఃశాంతిం ప్రయచ్ఛమే” అనే శ్లోకాన్ని చదువుతూ రాధాదామోదర ప్రీతయే ఆమలక తుండుల సహిత దీపదానం అంటూ సంకల్పం చెప్పి దానం చేయడం ద్వారా ఇహపర సుఖాలు కలుగుతాయని శాస్త్రం చెబుతున్నది.
-భైరవభట్ల సీతారామశర్మ, పురోహితుడు