
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 16: మెదక్ జిల్లాలో ప్రభు త్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. కరోనా ప్రభావంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను దూర ప్రాంతాలకు పంపించకుండా సొంత ఊరిలోని బడులకే పంపిస్తున్నారు. కరోనాతో ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా సర్కారు బడిలో చేర్పిస్తున్నారు. జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థుల చేరికతో ఉపాధ్యాయులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. మెదక్ జిల్లాలో 908 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో 624 ప్రాథమిక, 129 ప్రాథమికోన్నత, 145 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా ఆన్లైన్, డిజిటల్ తరగతులు జరిగాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనను ప్రభుత్వం ప్రారంభించింది. మరోవైపు సర్కారు బడుల్లో జరుగుతున్న తరగతులు, ఆర్థిక ఇబ్బందులు, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల భారం వంటి వాటితో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. హాజరు శాతం 60 శాతానికి పైగా చేరింది.
21,736 మంది విద్యార్థుల చేరిక..
ఇప్పటి వరకు మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 21,736 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరిలో 7,709 మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. అత్యధికంగా నర్సాపూర్ మండలం నుంచి 726 మంది విద్యార్థులు, మెదక్ మండలం నుంచి 874, చేగుంట మండలం నుంచి 591 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం పొందారు.
ప్రాథమికం బలోపేతం..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు మారుతున్నాయి. ప్రతి పాఠశాలలో ఒక్కో తరగతిలో సుమారుగా పది నుంచి 20 మంది వరకు విద్యార్థులు ప్రవేశాల పొందడంతో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతంలో తక్కువ మందితో గల పాఠశాలల్లో ఇప్పుడు విద్యార్థుల సంఖ్య పెరగడం గమనర్హం. దీంతో సర్కారు పాఠశాలలు కలకలలాడుతున్నాయి.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల మోత..
కరోనా నేపథ్యంలో 18 నెలలుగా పాఠశాలలు మూత పడడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కొంటున్నాయి. ఫీజుల వసూళ్లకు ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు.. గతేడాది ఫీజులతో పాటు పెండింగ్ ఫీజుల వసూళ్లపై దృష్టి సారించాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూప డం లేదు. ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నా రు. ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేట్‌లో సగానికి తక్కు వ మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు నూతనంగా ప్రభుత్వ పాఠశాల్లలో 21,736 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
పకడ్బందీగా కొవిడ్ నిబంధనలు
ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది కచ్చితంగా మాస్కు ధరించి వస్తేనే పాఠశాలలకు అనుమతిస్తున్నారు. తరగతి గదుల్లో భౌతిక దూరం పాటించేలా చర్య లు తీసుకుంటున్నారు. చేతులు శుభ్రపరుచుకునేందుకు సబ్బు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు. పాఠశాలలను ఎప్పటికప్పుడు జిల్లా విద్యాధికారితో పాటు ఆయా మండలాల విద్యాధికారులు పర్యవేక్షిస్తూ స్థితిగతులు తెలుసుకుంటున్నారు.
నిబంధనలు పాటిస్తున్నాం..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకూ హాజరు శాతం పెరుగుతున్నది. ప్రస్తుతం హాజరు శాతం 60పైనే చేరింది. విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించాలి. ఈ సంవత్సరం జిల్లాలో నూతనంగా 21,736 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొం దారు.
-రమేశ్‌కుమార్, జిల్లా విద్యాధికారి, మెదక్