
మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 31 : విద్యార్థినులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గురుకులాలు, కస్తూర్బాలు, మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. సన్నబియ్యంతో రుచికరమైన భోజనం పెడుతున్నది. క్రీడల్లో రాణించడానికి శిక్షణతోపాటు ఇతర అంశాల్లో సైతం ప్రోత్సాహం అందిస్తున్నది. ఒక్కో విద్యార్థినికి ఏడాదికి రూ.1.25 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఉచితంగా పుస్తకాలు, నోట్‌బుక్స్, కాస్మోటిక్ చార్జీలను సైతం ప్రభు త్వం అందజేస్తున్నది. వీటితోపాటు విద్యార్థినులకు కరాటే, యోగాతోపాటు చిత్రలేఖనం, వృత్తి విద్య కోర్సులను సైతం నేర్పిస్తున్నారు. కార్పొరేట్ స్థాయి విద్య అందుతుండటంతో గురుకుల పాఠశాలలకు పోటీ పెరిగింది. పట్టణాలతోపాటు గ్రామాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.
పది నుంచి ఇంటర్..
గతంలో కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో పదో తరగతి వరకు మాత్రమే చదువుకునే అవకాశం ఉండేది. తరువాత ఇంటర్ ఆపై చదువులకు వాటిలోనే అవకాశం కల్పించింది. మెదక్ జిల్లాలో 15 కేబీవీబీ విద్యాలయాలు ఉండగా వాటిలో మెదక్, చేగుంట, నర్సాపూర్, అల్లాదుర్గం కేజీబీవీలను ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి అప్‌గ్రేడ్ చేసింది. నిరుపేద విద్యార్థినుల కోసం ప్రభుత్వం కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సకల సౌకర్యాలు..
6వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఇంటర్ పూర్తయ్యే వరకు కార్పొరేట్‌ను తలదన్నే నాణ్యమైన విద్యనందిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం మధ్యా హ్నం, రాత్రి పౌష్టికరమైన భోజనం, సాయంత్రం స్నాక్స్, వారానికి మూడు సార్లు మాంసం, గుడ్లు అందిస్తారు. విద్యార్థినులకు 3 నెలలకు అవసరమయ్యే హెల్త్ కిట్స్ విద్యా సంవత్సరంలో మూడుసార్లు అందజేస్తున్నారు.