
టేక్మాల్ ఆగస్టు 9: రాష్ట్ర ప్రభుత్వం రైతులను అనేక పథకాలు ప్రవేశ పెట్టి వారికి అండగా నిలుస్తున్నది. ఇందులో భాగమే రైతు బీమా అన్నదాత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నది. పెద్దదిక్కును కోల్పోతే కుటుంబం అనాథగా మారకుండా సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 2019 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకంలో ఎంతో మంది అన్నదాతల కుంటుబానికి ఆసరాగా నిలుస్తున్నది. రైతన్నకు వెన్నంటి ఉండేందుకు తెలంగాణ సర్కార్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. గుంట భూమి ఉన్నా ఈ పథకం వర్తింపజేస్తున్నారు. రైతు అకాల మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందజేస్తున్నారు. ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో చనిపోయిన 2677 మంది రైతు కుటుంబాలకు రూ.133 .85కోట్లు చెల్లించారు.
రైతు బీమా పథకం మొట్టమొదటి సారిగా సీఎం కేసీఆర్ 2019 ఆగస్టు 15న ప్రారంభించారు. గుంట భూమి ఉన్న రైతుకు సైతం రూ.5లక్షల రైతుబీమా కొండంత అండగా నిలిచింది. సరికొత్త ఆలోచనలతో తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.5వేలతో రైతుబంధుతో పంట పెట్టుబడికి ఆదుకున్నది. చిన్న, సన్నకారు రైతు ప్రమాదవశాత్తుకాని, సహజ మరణం కాని సంభవిస్తే వా రి కుటుంబానికి వారం రోజుల్లో రైతు బీమా చెల్లిస్తున్నా రు. రైతు బీమా పథకం ప్రారంభం నుంచి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు చనిపోయిన అర్హులైన 2667 రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.133.85కోట్లు చెల్లించారు. 2020-2021లో 1103 రైతు కుటుంబాలకు రూ.55. 15కోట్లు అందజేశారు
ఈ ఏడాది ఆగస్టు 3లోపు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న 18 సంవత్సరాల నుంచి 59 ఏండ్ల లోపు ఉన్న రైతులందరికి రైతు బీమా వర్తిస్తుంది.పట్టాపాసు పుస్తకం, ఆధార్‌కార్డు, నామినీ ఆధార్‌కార్డు జిరాక్స్ పత్రాలను సంబంధిత ఏఈవోలకు అందజేయాలి.రైతు బీమా పథకానికి ఈ నెల 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
గుంట రైతుకు కూడా రూ.5లక్షలు
గుంట భూమి ఉన్న రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5లక్షల ఇన్సూరెన్స్ డబ్బులను ప్రభుత్వం అందజేస్తున్నది. రైతు అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే కుటుంబానికి రూ.5లక్షలు అం దించి తెలంగాణ సర్కారు వారికి అండగా నిలుస్తున్నది. బీమా చెల్లింపులో ఎలాం టి అవినీతి, అక్రమాలకు తావులేకుండా రైతు కుటుంబాల నామినీ బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి.
-సుప్రజా భాస్కర్, సర్పంచ్, టేక్మాల్
రైతు బీమా రైతు కుటుంబాలకు భరోసానిస్తుంది. రైతు మరణించినట్లు సమాచారం వచ్చిన వెంటనే వారి వివరాలను సేకరిస్తున్నాం. వారంలోపు ఇన్సూరెన్స్ డబ్బులు నామినీ ఖాతాలో జమ అవుతున్నాయి.రైతు బీమా పథకం ప్రారంభం నుంచి నేటి వరకు జిల్లాలో 2677 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.133. 85కోట్లు చెల్లిస్తున్నాం. ఈ యేడాది బీమా నమోదుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.