
మెదక్, నవంబర్ 7 :మెదక్ జిల్లాలో వరుస హత్యలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ హత్యలు చేయడంతో పోలీసులకు సవాల్‌గా మారుతున్నది. నేరాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నా హత్యలు ఆగ డం లేదు. మెదక్ జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు 18 హత్యలు జరిగాయి. కారణం ఏదైనా హత్యలు చేసేందుకు వెనుకాడడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు 129 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. పోలీసులు ప్రధానంగా ఓ వ్యక్తిపై హత్య కేసుతో పాటు మరో కేసు ఉన్నా నేరాలను నియంత్రించేందుకు రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నారు.
నేరాల నియంత్రణకు చర్యలు..
మెదక్ జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్ర ంతో పాటు ఆయా గ్రామాల్లో రాత్రివేళల్లో నేరాలు జరగకుండా పెట్రోలింగ్ , 100 డయల్ సిబ్బంది ఎప్పటికప్పుడు నిఘా పటిష్టం చేస్తున్నారు. ముఖ్యంగా పల్లెల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసే వ్యక్తులు హత్యలకు పాల్పడడానికి వెనుకాడడం లేదు. ఎవరైనా వ్యక్తిపై మూడు కేసులు ఉంటే ఒక హత్య కే సులో ప్రమేయం ఉన్నా.. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు రౌడీషీట్ ఓపెప్ చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో 129 మంది
రౌడీషీటర్లు…
మెదక్ జిల్లా పోలీసు శాఖ పరిధిలో రికార్డుల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 129 మంది రౌడీషీటర్లు ఉన్నారు. దందాలు, బెదిరింపు లు, హత్యలు, రౌడీయి జం, దౌర్జన్యాలు, అక్రమ వ్యా పారాలు, అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారిపై నేరాల తీవ్రత ఆధారంగా రౌడీషీట్ తెరిచారు. నేరస్తుల సర్వే నిర్వహించినప్పుడు ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారి వివరాలు సేకరించారు. తాజా ఫొటోలతో వారిపై నమోదైన నేరాలు, శిక్షలు, ప్రస్తుత జీవన విధానం, ప్రవర్తన కుటుంబ వివరాలు సేకరించి నేరాలను బట్టి కొత్తగా హిస్టరీ షీట్ పొందుపరుస్తున్నారు.
పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం
జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 18 హత్యలు జరిగాయి. జిల్లాలో 129 మంది రౌడీషీటర్లు ఉన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో రాత్రివేళల్లో నేరాలు జరగకుండా పెట్రోలింగ్ సిబ్బంది, 100 డయల్ సిబ్బంది ఎప్పటికప్పుడు నిఘా పటిష్టం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం.
-చందనదీప్తి, ఎస్పీ మెదక్