హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సంచలనం సృష్టించారు. చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ సత్తాచాటుతామని నిరూపించారు. నార్మండీ(ఫ్రాన్స్) వేదికగా మే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక 19వ వరల్డ్ స్కూల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు గురుకులాలకు చెందిన యువ అథ్లెట్లు మాయావతి, రవికిరణ్ ఎంపికయ్యారు. వీర్దిదరు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. భువనేశ్వర్‌లో తాజాగా ముగిసిన 65వ ఎస్జీఎఫ్ఐ జాతీయ ఓపెన్ సెలెక్షన్స్‌లో మాయావతి (100మీ, 200మీ), రవికిరణ్ (టీ-35, 100మీ, జావెలిన్‌త్రో) రెండేసి పసిడి పతకాలతో మెరిశారు. బరిలోకి దిగిన పోటీల్లో ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ఈ ఇద్దరు యువ అథ్లెట్లు అద్భుత ప్రతిభ చాటారు. వరల్డ్ స్కూల్ అథ్లెటిక్స్ టోర్నీకి ఎంపికైన మాయావతి, రవికిరణ్‌ను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి రొనాల్డ్‌రాస్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ వేదికపై రాణించి రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.