
సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు విస్తరిస్తుండటంతో నగర వాసులు వణికిపోతున్నారు. అత్యవసరమైతేనే బయటకు వస్తున్నారు. దీంతో నగర రోడ్లపై ట్రాఫిక్ తగ్గుముఖం పట్టింది. సాధారణ సమయంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో 30శాతం ట్రాఫిక్ తగ్గుముఖం పట్టిందని ఇంటలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం, పలు ప్రైవేటు సంస్థలు వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగిస్తుండటం కూడా ట్రాఫిక్ తగ్గుదలలో మరో కారణంగా చెప్పవచ్చు.
స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష
ప్రస్తుతం కరోనాతో అంతగా ప్రమాదం లేదని వైద్య నిపుణులు చెబుతున్నా.. స్వీయ నియంత్రణతోనే కరోనాను కట్టడి చేయవచ్చనే భావన నగర ప్రజల్లో ఉంది. కరోనా బారిన పడకుండా ఉండాలంటే అనవసరంగా బయట తిరగవద్దని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తప్పని సరిగా మాస్క్ ధరించాలని, తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని అవగాహన కల్పిస్తుంది.
ట్రాఫిక్ లెక్కింపు ఇలా….!
నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లలో ఐటీఎంఎస్ ద్వారా ట్రాఫిక్‌ను అంచనా వేస్తుంటారు. నగరం నలువైపులా నుంచి వచ్చిపోయే వాహనాలను లెక్కిస్తుంటాయి. ప్రతి రోజు ఆ కూడలి నుంచి ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయనేది లెక్కలు వేసి, ఆ రోజులో సగటున వెళ్లిన వాహనాలను
గుర్తిస్తుంటారు.
సాధారణ రోజుల్లో 7లక్షల వరకు
నల్గొండ క్రాస్‌రోడ్స్, అబిడ్స్, రవీంధ్రభారతి, తెలుగుతల్లి చౌరస్తా, ప్యాట్నీ, సీటీవో, రసూల్‌పురా, జుబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు, సాగర్ సొసైటీ తదితర జంక్షన్లలో వచ్చిపోయే వాహనాలను లెక్కిస్తుంటాయి. సాధారణ రోజుల్లో సుమారు 7 లక్షల నుంచి 4 లక్షల వరకు
తిరుగుతుంటాయి.
ఖైతరాబాద్ చౌరస్తాలో సాధారణ రోజుల్లో గత ఏడాది డిసెంబర్ 20వ తేదీ సమయంలో ప్రతి రోజు సుమారు ట్రాఫిక్ 6.5 లక్షల నుంచి 6 లక్షల వరకు తిరుతుంది. జనవరి 20 నాటికి ఈ ట్రాఫిక్ 4.55 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంది.
జుబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద సాధారణ రోజుల్లో 5.5 లక్షల నుంచి 5 లక్షల ట్రాఫిక్ ఉంటుంది. జనవరి 20 నాటికి 3.85 లక్షల నుంచి 3.5 లక్షల వరకు ఉంది.
రోడ్లపై ట్రాఫిక్ తగ్గింది
ప్రస్తుతం రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉంది. అన్ని శాఖలు సమన్వయంతో సిటీలో ట్రాఫిక్ సమస్యలపై పనిచేస్తున్నాయి. ఎస్ఆర్డీపీలో భాగంగా పలు కూడళ్ల విస్తరణ జరిగింది. నగరంలో వాహనాల వేగం పెరగడంతో ట్రాఫిక్ రద్దీ ఎక్కడ కన్పించదు. అయితే ప్రస్తుతం కొవిడ్ కారణంగా ప్రజలు తప్పని సరి అయితేనే రోడ్లపైకి వస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. నగరం విస్తరిస్తూ, రోజురోజుకు నగరంలోకి వచ్చే కొత్త వాహనాల సంఖ్య పెరుగుతున్నా హైదరాబాద్‌లో మాత్రం ట్రాఫిక్ రద్దీ లేకుండా వాహనాల వేగం పెరుగుతుంది.
వారసత్వ ప్రదేశాలపై బుక్లెట్ ఆవిష్కరణ
సిటీబ్యూరో, జనవరి 25(నమస్తే తెలంగాణ): జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని వారసత్వ ప్రదేశాలపై పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన బుక్‌లెట్‌ను మంగళవారం ఆవిష్కరించారు. తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎస్.రాజేంద్ర కుమార్ నగరంలోని డాక్ సదన్‌లో హైదరాబాద్ ప్రాంతీయ పోస్టుమాస్టర్ జనరల్ డాక్టర్ పి.విద్యాసాగర్‌రెడ్డి సమక్షంలో పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ కేఏ దేవరాజ్‌తో కలిసి ఈ బుక్ లెట్‌ను ఆవిష్కరించారు. దేశంలో 40 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 16 సైట్లలో పోస్టల్ డిపార్ట్మెంట్ స్టాంపులు విడుదల చేసిందని పేర్కొన్నారు. యునెస్కో గుర్తించిన కట్టడాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పురాతన కోటలను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని పోస్టల్ అధికారులు తెలిపారు. వీటితో పాటు జాతీయ అభయారణ్య పార్కులు, చారిత్రక సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన పట్టణాలు ఉన్నాయన్నారు. కొన్నింటిపై మూడు సిరీస్‌లలో స్టాంపులను విడుదల చేసిందని చెప్పారు.