Theft | వినాయక్ నగర్, సెప్టెంబర్, 18 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డాను. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు ఇంటి కిటికీ గ్రిల్ ను తొలగించి లోనికి దూకారు. నిజామాబాద్ నగరంలోని 5 వటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దోపిడీ జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నగర శివారులోని బాబన్ సహాడ్ ప్రాంతంలో నివాసముండే నిషాత్ ఆఫ్రిన్ అనే మహిళ అర్సపల్లిలోని తమ బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో బుధవారం ఇంటికి తాళం వేసి అక్కడికి వెళ్ళింది.
గురువారం ఉదయం వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బీరువా ధ్వంసం చేసి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటన స్థలాన్ని పరిశీలించగా దుండగులు ఇంటి కిటికీ గ్రిల్స్ స్క్రూ డ్రైవర్‌తో తొలగించి లోనికి ప్రవేశించి దోపిడీకి పాల్పడిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో సుమారు రూ.పది లక్షల వరకు విదేశీ కరెన్సీ తో పాటు పది తులాలు బంగారం దోపిడీకి గురైనట్లు బాధితులు తెలిపారు. విషయం తెలియడంతో ఇది స్థానికుల దొంగల పని కాదని కిటికీ గ్రిల్ తొలగించి దోపిడీకి పాల్పడేది మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ముఠా దోపిడీ చేసిందని పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
విషయం తెలియడంతో సీసీఎస్ ఎసీపీ నాగేంద్ర చారి ఘటనా స్థలానికి వెళ్లి దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు. సహజంగా కిటికీ గ్రిల్ తొలగించి దోపిడీలకు పాల్పడేది అంతర్రాష్ట్ర ముఠాపనేనని ఏసీపీ అనుమానాలు వ్యక్తం చేశారు. దోపిడీ ముఠా ను త్వరలోనే పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఘటన స్థలానికి ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్ తోపాటు క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముందుగా 20 తులాల బంగారం చోరీ అయినట్లు బాధితులు తెలిపినప్పటికీ ఇంట్లోనీ ఓ గదిలో బంగారు బిస్కెట్ ఇంటి యజమానికి దొరికినట్లుగా పోలీసులు తెలిపారు.