న్యూఢిల్లీ: అహ్మాదాబాద్‌లో ఈ ఏడాది జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియా విమానం కూలిన(Air India Crash) ఘటన తెలిసిందే. అయితే ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు అమెరికా కోర్టులో కేసు దాఖలు చేశాయి. బోయింగ్, హానీవెల్ సంస్థలపై ఆ కేసు వేశారు. నాసిరకంగా ఇంధన స్విచ్‌లను తయారు చేసేందుకు కేసు బుక్ చేశారు. ఆ విమాన ప్రమాదంలో 260 మంది మరణించిన విషయం తెలిసిందే. బాధితుల్లో నాలుగు ఫ్యామిలీలు అమెరికాలో డెలావేర్ కోర్టులో ఆ రెండు కంపెనీలపై కేసు నమోదు చేశారు.
బోయింగ్, హానీవెల్ కంపెనీలు ఫ్యుయల్ స్విచ్‌లు తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అహ్మాద్‌బాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న ఫ్లయిట్ 171 ఆ రోజున టెకాఫ్ తీసుకున్న సెకన్లలోనే నేలకూలింది. ఇంధన స్విచ్‌ల్లో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. 2018 ఎఫ్ఏఏ అడ్వైజరీ ప్రకారం ఫ్యుయల్ కటాఫ్ స్విచ్‌లను తనిఖీ చేయాలని, కానీ అలా జరగలేదని ఆరోపించారు. ప్రమాదంలో మరణించిన కాంటాబెన్ ధీరూభాయ్ పగాదల్, నవ్య చిరాగ్ పగాదల్, కుబేర్భాయ్ పటేల్, బాబీబెన్ పటేల్ కుటుంబీకులు అమెరికా కోర్టులో నష్టపరిహారం కేసు వేశారు.