ఆ తహసీల్దార్.. శంషాబాద్‌లో పదెకరాల అటవీ భూమిని ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ల్యాండ్ సీలింగ్ భూముల్లో ఆర్డీవో ఇవ్వాల్సిన ఉత్తర్వులు ఆయనే ఇచ్చేశారు. అంతకుముందు అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని మునగనూరులో దాదాపు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు రాసిచ్చారు. అదే మండలంలో మరో చోట ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని అదే ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టారు. అయినా.. సదరు తహసీల్దార్‌పై చర్యలుండవు. ఉన్నతాధికారులు కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకొన్నారు. సాధారణ ఉద్యోగి చిన్న తప్పు చేస్తేనే సస్పెన్షన్ వేటు వేసే ఉన్నతాధికారులు, ఆ తహసీల్దార్ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఉన్నతాధికారుల చేతులు కట్టేస్తున్న ఆ ‘బిగ్’ హస్తమెవరిది? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఏ రెవెన్యూ కార్యాలయంలో చూసినా అధికారుల మధ్య ఇదే చర్చ నడుస్తున్నది!
రంగారెడ్డి, జూలై 13 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయల విలువ చేసే విలువైన ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా పట్టాలుగా మార్చిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోకుండా ‘బిగ్’ హస్తం రక్షణ కవచంగా నిలిచిందని జోరుగా చర్చ నడుస్తున్నది. గతంలో అబ్దుల్లాపూర్‌మెట్.. ఆ తర్వాత శంషాబాద్ పరిధిలో ఉన్నతాధికారులు సైతం విస్తుపోయేలా ఆ తహసీల్దార్ అడ్డగోలు ఉత్తర్వులు జారీ చేశారు.
ఓవైపు మీడియా కథనాలతో పాటు ఉన్నతాధికారుల విచారణలోనే సదరు తహసీల్దార్ అవకతవకలకు పాల్పడినట్టు వెల్లడైంది. అయినా ఆయనను వెనకేసుకు రావడంపై రెవెన్యూ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇతరుల విషయంలో సస్పెన్షన్ కొరడా పట్టుకొని వేచి ఉండే కలెక్టర్ మొదలు ఇతర ఉన్నతాధికారులు ఈ తహసీల్దార్‌పై ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘బిగ్ బ్రదర్’ అనుచరుడికి తహసీల్దార్ ఎకరాలకెకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా రాసిచ్చి రికార్డులను ఏమార్చడం.. సదరు అనుచరుడు వెంచర్లు చేసి కోట్లకు కోట్లు దండుకోవడం వెలుగులోకి వచ్చింది. చివరికి కొంతకాలం కిందట మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్‌పై జరిగిన ఏసీబీ దాడుల సమయంలోనూ ఈ వెంచర్ల నుంచి గిఫ్టు డీడ్స్గా ప్లాట్లు ఉండటమే ఆయనగారి పెచ్చుమీరిన అవినీతికి ఉదాహరణగా నిలిచింది.
శంషాబాద్ మండలం పెద్దషాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో 172 నుంచి 183 వరకు ఉన్న సర్వేనంబర్లలో (పాత సర్వేనంబర్ 202) సుమారు 170 ఎకరాల భూమి ఉన్నది. దీనిపై చాలాకాలంగా న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ భూములు సీలింగ్ సర్ప్లస్ పరిధిలోకి వస్తాయి. ఇందులో దాదాపు 74 ఎకరాలను సీలింగ్ సర్ప్లస్ కింద ప్రకటించారు. మిగిలిన దానిలో దాదాపు 94 ఎకరాలు నవాబ్ మహ్మద్ వాజుద్దీన్ఖాన్కు చెందినవి కాగా ఆయన 1967లో నలుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలకు పార్టిషన్ డీడ్ చేశారనేది ఆయన వారసుల వాదన. ఆ మేరకు హైకోర్టును ఆశ్రయించారు.
ఇదే ఈ భూముల్లో ప్రొటెక్టెడ్ టెనెంట్స్ కింద 44 మంది తాము జీ ఈశ్వరయ్య నుంచి కొనుగోలు చేశామని వాదిస్తూ న్యాయపరంగా పోరాడుతున్నారు. ఇటీవల దీనిపై హైకోర్టు తీర్పు వచ్చిందని, ఆ మేరకు శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న వాజుద్దీన్ఖాన్ వారసులకు ఈ భూమి చెందుతుందంటూ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇది 7/1958 సూట్ పరిధిలోకి వస్తుందని, ఫైనల్ డిక్రీ కూడా ఉండటంతో పాటు ఇందులో ప్రొటెక్టెడ్ టెనెంట్స్ లేరని ఉత్తర్వుల్లో నిర్ధారించారు. వాస్తవానికి సీలింగ్ సర్ప్లస్ పరిధిలోకి వచ్చే భూములైనందున ఈ ప్రక్రియ అంతా ఆర్డీవో ట్రిబ్యునల్ చూసుకోవాల్సి ఉంటుంది.
భూ వివాదాలకు సంబంధించి టైటివ్ (యాజమాన్య హక్కులు)ను నిర్ధారించే అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఇంత పెద్ద విస్తీర్ణంలో, ఏండ్ల తరబడి న్యాయ వివాదంలో ఉన్న అత్యంత విలువైన భూములకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ఉన్నతాధికారుల ద్వారా తహసీల్దార్ తన పరిధి మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. పైగా 44 మంది ప్రొటెక్టెడ్ టెనెంట్స్ కూడా న్యాయ పోరాటం చేస్తున్నందున వివాద పరిష్కారంలో భాగంగా కనీసంగా వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేయడం సహజ న్యాయ సూత్రం. కానీ ఇవేవీ పట్టించుకోకుండా.. ఉన్నతాధికారుల పాత్రను సైతం తనే పోషించి ఏకంగా 94 ఎకరాల టైటిల్, రికార్డుల మార్పును తన భుజాన వేసుకొని తహసీల్దార్ దత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ క్రమంలో శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగాయి. ఈ రికార్డులన్నీ పరిశీలించి, తహసీల్దార్ దత్‌ను విచారించారు. తెర వెనుక ‘ముఖ్యనేత’ ప్రధాన అనుచరుడి పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఏసీబీ దాడులు మొదలు తహసీల్దార్‌పై చర్యల వరకు అంతా గప్‌చుప్ అయింది. కేవలం రవీందర్ దత్‌ను కలెక్టరేట్లోని ఎన్నికల విభాగానికి బదిలీ చేసి చేతులు దులుపుకొన్నారు.
శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 626/2లో 176.05 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో అటవీ శాఖ గెజిట్‌లో 626/2 కింద 166 ఎకరాల భూమి ఉన్నట్టుగా నమోదైంది. 626/2లో మిగిలిన 10.05 ఎకరాల భూమి ప్రభుత్వానిది. ఇందులో 9.05 ఎకరాలకు తజముల్ మొయినొద్దీన్ ఖాన్ అనే వ్యక్తికి డిక్రీ ఉన్నదని, అందులో ఒక గదితో పాటు చుట్టూ ప్రహరీ ఉన్నందున (వాస్తవానికి అందులో ఏమీ లేదు) అతడికే చెందుతుందని తేదీ, ఫైల్ నంబర్, ఏమీ లేకుండానే ఎండార్స్మెంట్ ఉత్తర్వులిచ్చారు.
ఇందుకోసం తెరవెనుక పెద్ద ఎత్తున చేతులు మారినట్టు తెలిసింది. దీనిపై ఆరా తీస్తే స్థానిక ప్రజాప్రతినిధి అల్లుడు బినామీయే సదరు దరఖాస్తుదారుడు ప్రచారం జరిగింది. కాగా తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్‌మెంట్‌ను పట్టుకొని సదరు వ్యక్తి ఏకంగా అందులో కంటెయినర్ వేసి, లే అవుట్ చేసి, అందమైన బ్రోచర్లు రూపొందించి చదరపు గజం రూ.30-40 వేలకు మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. దీనిపై స్థానిక బీఆర్ఎస్ పెద్దసంఖ్యలో కలిసి కలెక్టర్, ఇతరులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడుతుందని ఇదే తహసీల్దార్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా యం త్రాంగం సహాయంతో దగరుండి కంటెయినర్, ఇతర నిర్మాణాలను కూల్చివేయించారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని మునగనూరులో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని తహసీల్దార్ ప్రైవేట్ వ్యక్తులకు పట్టాచేశారు. 22ఏ నిషేధిత జాబితాలో స్పష్టంగా ప్రభుత్వ భూమిగా ఉన్నా ‘బిగ్’ అనుచరుడి పేరిట భూమిని బదలాయించారు. సుమారు రూ.200 కోట్ల విలువైన ఈ భూములను అప్పనంగా అప్పగించడమే కాకుండా నాలా అనుమతి ఇచ్చారు. సర్వేనంబర్ సబ్ డివిజన్స్ మూడు రకాలుగా ఏమారుస్తూ బురిడీ కొట్టించారు. ఇదే మండలంలోని పిగ్లీపూర్‌లో సుమారు 170 ఎకరాల ప్రభుత్వ, సీలింగ్, గైరాన్ భూమి ఉన్నది.
ఈ భూమిపై కూడా ఎలాంటి లావాదేవీలు జరుపవద్దనే ఉత్తర్వులు ఉన్నాయి. అయినా సదరు తహసీల్దార్ సుమారు పదెకరాల భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇవన్నీ కేవలం బయటికొచ్చిన కొన్ని అక్రమాలు మాత్రమే. బిగ్ బ్రదర్‌తో పాటు బడాబాబులకు ఇంకా ఎక్కడ, ఎన్నెన్ని ఎకరాల మేర ఉన్నాయనేది అంతుచిక్కని విషయంగా మారింది. సమగ్ర విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని రెవెన్యూ వర్గాలే చెప్తున్నాయి.