కీవ్, ఏప్రిల్ 3: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా మారణహోమం సృష్టిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలతో పాటు పౌరులను లక్ష్యంగా చేసుకొని దురాగతాలకు పాల్పడుతున్నది. కీవ్ సమీపంలోని బుచ్చా పట్టణంలో పలుచోట్ల గుర్తించిన దాదాపు 300 శవాలు.. రష్యా బలగాల ఖర్కశత్వానికి దర్పణం పడుతున్నది. దాదాపు నెలపాటు రష్యా సేనల అధీనంలో ఉన్న బుచ్చాను నాలుగు రోజుల క్రితం ఉక్రెయిన్ తన అధీనంలోకి తీసుకున్నది. రష్యా బలగాలు వెళ్లిపోయిన తర్వాత నగరంలోని ఒక్క వీధిలోనే 20 మంది పౌరుల మృతదేహాలను గుర్తించినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ ఏఎఫ్పీ జర్నలిస్టులు పేర్కొన్నారు. ఇతర చోట్ల పడివున్న శవాల ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. వీలైనంత మంది ఉక్రెయిన్ పౌరులను చంపేయాలని రష్యా లక్ష్యంగా పెట్టుకున్నదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా అన్నారు. ‘వారి ఆగడాలను అడ్డుకోవాలి. తరిమికొట్టాలి’ అని ట్వీట్ చేశారు.
పలు దేశాల ఖండన
పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు అనే తేడా లేకుండా రష్యా బలగాలు తమ పౌరులను పొట్టన పెట్టుకున్నాయని బుచ్చా మేయర్ అనటోలీ ఫెడొరుక్ పేర్కొన్నారు. ఇప్పటికే 280 మృతదేహాలను సామూహిక ఖననం చేశామని తెలిపారు. రష్యా బలగాల దురాగతాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు పలు దేశాలు ఖండించాయి. ఇది రష్యా సృష్టించిన మారణహోమమే అని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా దురాగతాల ఫొటోలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ అన్నారు. యుద్ధ నేరాలుగా పరిగణించి విచారణ చేపట్టాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ డిమాండ్ చేశారు.
ఒడెస్సాపై రష్యా క్షిపణి దాడులు
ఉక్రెయిన్ దక్షిణ తీర నగరం ఒడెస్సాపై రష్యా క్షిపణి దాడులు చేసింది. ఓ చమురు శుద్ధి కర్మాగారంతో పాటు, మూడు ఇంధన డిపోలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. మరో పోర్టు సిటీ మైకోలైవ్పైనా దాడులు జరిగినట్టు స్థానిక మేయర్ సెన్కెవిచ్ తెలిపారు. రాజధాని కీవ్ రీజియన్ మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ తెలిపింది. రష్యా బలగాల చెరలో 11 మంది స్థానిక మేయర్లు ఉన్నారని, వారిలో కీవ్ రీజియన్లోని మోతిజిన్ మేయర్ ఓల్గాను చంపేశారని ఉక్రెయిన్ ఉపప్రధాని ఇరినా వెరెష్చుక్ ఆరోపించారు.